Friday, November 22, 2024

AP: శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం..

కర్నూలు బ్యూరో : ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం శ్రీశైలంలో శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి అమ్మవార్లకు వైభవంగా స్వర్ణరథోత్సవం నిర్వహించారు. శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి ఈ స్వర్ణరథోత్సవానికి విచ్చేశారు. నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు ఈ స్వర్ణరథాన్ని దేవస్థానానికి విరాళంగా సమర్పించారు.

ఈనాటి రథోత్సవానికి దాతలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శాసనసభ్యులు, కొవ్వూరు, నెల్లూరు జిల్లా వారు రావడం జరిగింది. కాగా ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించడం విశేషం. స్వర్ణ రథోత్సవంలో ముందుగా అర్చక స్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. అనంతరం ఉదయం గం.7.30లకు ఈ స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందుభాగం నుంచి ఆలయ నాలుగు మాడవీధుల గుండా ఈ రథోత్సవాన్ని జరిపించడం జరిగింది. సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో కోలాటం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేయడం విశేషం.

- Advertisement -

ఇక ఈనాటి స్వర్ణరథోత్సవంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు దంపతులు, అర్చకస్వాములు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, తదితర సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. అదేవిధంగా నాలుగు మాడవీధుల్లో కూడా అధిక సంఖ్యలో భక్తులు రథోత్సవాన్ని తిలకించారు.

ఈ సందర్భంగా దాత వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ… ఎన్నో జన్మల పుణ్యఫలితంగానే తమకు ఈ స్వర్ణరథాన్ని సమర్పించే అవకాశం లభించిందన్నారు. ప్రతీమాసంలో కూడా ఆరుద్ర నక్షత్రం రోజున దేవస్థానం వారు ఈ రథోత్సవాన్ని నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. క్షేత్రాధిదేవులైన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లు అందరికీ శ్రేయస్సును కలిగించాలని వారు ఆకాంక్షించారు.


తరువాత కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు మాట్లాడుతూ… దేవస్థానానికి స్వర్ణరథాన్ని సమర్పించిన దాతలకు కృతజ్ఞతలను తెలియజేశారు. దేవస్థాన వైదిక మండలి సూచనల మేరకు లోకకల్యాణార్థమై ప్రతీమాసంలో కూడా ఆరుద్రోత్సవం రోజున ఈ స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ధర్మప్రచారంలో భాగంగా దేవస్థానంలో మరిన్ని భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement