Thursday, November 21, 2024

బంగారం స్మగ్లింగ్‌ గుట్టురట్టు.. 5.80 కోట్ల విలువైన 10.77 కిలోల బంగారం పట్టివేత

అమరావతి, ఆంధ్రప్రభ: చెన్నై కేంద్రంగా ఏపీకి పెద్ద ఎత్తున తరలుతున్న బంగారం స్మగ్లింగ్‌ గుట్టునే కస్టమ్స్‌ కమిషనరేట్‌ అధికారులు రట్టు చేశారు. రూ.5.80 కోట్ల విలువైన 10.77 కిలోల బంగారం, విదేశీ మార్కింగ్‌తో ఉన్న 24 వెండి బార్లను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో 2014లో కస్టమ్స్‌ కమిషనరేట్‌(ప్రివెంటివ్‌) ఏర్పాటు చేసిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో స్మగ్లింగ్‌ బంగారం పెట్టుకోవడం ఇదే తొలిసారి. వివరాల్లోకి వెళితే..ఈ నెల 24న చెన్నై నుంచి గుంటూరు, రాజమండ్రికి బంగారం కడ్డీలు స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు వచ్చిన నిర్థిష్టమైన సమాచారం మేరకు విజయవాడ కస్టమ్స్‌ కమిషనరేట్‌ ప్రివెంటివ్‌ అధికారులు రంగంలోకి దిగి నిఘా పెట్టారు. విజయవాడ-చెన్నై జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద అనుమానంపై మూడు కార్లను ఆపి అందులో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. అధికారుల విచారణలో కార్లలో ప్రయాణికులు కూర్చునే సీట్ల కింద భాగంలో బంగారం తరలించేందుకు ప్రత్యేకంగా బాక్సులను ఏర్పాటు చేయడం గుర్తించారు.

ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకొని రూ.5.80 కోట్ల విలువైన 10.77 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో కాకినాడ కస్టమ్స్‌ ప్రివెంటివ్‌ డివిజన్‌ అధికారులు మరుసటి రోజు రాజమండ్రిలో తనిఖీలు నిర్వహించగా కిలో చొప్పున బరువున్న 24 వెండి కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఆ కడ్డీలపై విదేశీ గుర్తులుండటాన్ని అధికారులు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఐదుగురిని అరెస్టు చేసి మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను ఆదివారం విశాఖపట్టణంలోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. కస్టమ్స్‌ కమిషనరేట్‌(ప్రివెంటివ్‌) విభాగం విజయవాడలో ఏర్పాటు చేసిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే తొలిసారి. నిఘా పెంచడం, నెట్వర్క్‌ అభివృద్ధి చేసుకోవడం ద్వారా స్మగ్లింగ్‌ను అరికట్టడంలో విజయవాడ డివిజన్‌ ముందంజలో ఉన్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement