తిరుపతి, ప్రభన్యూస్ బ్యూరో : 2024 సంవత్సరంలో జర గబోయే ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నానని అర్జున్ అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ కిదాంబి శ్రీకాంత్ తెలిపారు. తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఆహ్వానం మేరకు ఆయన కార్యాలయానికి వరల్డ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ వచ్చారు. మీడియా సమావేశంలో కిదాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ 2022లో జరగబోయే కామన్ వెల్త్ గేమ్స్, ఏసియన్ గేమ్స్ మిగిలిన సూపర్ సిరీస్ మ్యాచ్‌లలో విజయం సాధించడానికి దృష్టి పెట్టానని చెప్పారు. తిరుపతిలో బ్యాడ్మింటన్‌ను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి 5 ఎకరాల స్థలం కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
నా ప్లేయింగ్ కెరీర్ పూర్తయిన తరువాత తిరుపతిలో అకాడమీని ఏర్పాటు చేసి, పూర్తి స్థాయిలో క్రీడాకారులకు అందుబాటులో ఉండి ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చి దిద్దుతానన్నారు. క్రీడాకారులకు ఏ సందేహమున్నా వారందరికీ అందుబాటులో ఉండి క్రీడల్లో మరింత రాణించేలా సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు తిరుపతిలో తాను అకాడమీ ఏర్పాటు చేసేందుకు 5 ఎకరాలు కేటాయించడం మరచిపోలేనన్నారు. అనంతరం ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ కిదాంబి శ్రీకాంత్ సాధించిన విజయాల వల్ల దేశ ప్రతిష్టను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారన్నారు. ఆయన్ను ఆదర్శవంతంగా తీసుకుని ఎంతోమంది యువతకు, క్రీడాకారులు వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌కు ఎంపి గురుమూర్తి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.