Tuesday, November 26, 2024

Ap | దేవుడి సొమ్ముకు రెక్కలు! ఈవోల ఖాతాలకు మళ్లింపు..

అమరావతి, ఆంధ్రప్రభ: దేవుడు సోమ్మును కొందరు ఈవోలు దోచుకుంటున్నారు. ఆలయ ఆస్తులపై వచ్చే అద్దెలు స్వాహా చేసే వారు కొందరైతే.. దేవుడి ఆస్తులను ఏళ్ల తరబడి ఇళ్లల్లో పెట్టుకుంటున్న వారు కొందరు. లీజుల సొమ్ము తగ్గించి చూపుతూ ఆలయ ఆస్తులకు గండికొడుతున్న ఘనలు దేవాదాయశాఖలో ఉన్నారు. ఆలయాలకు చెందాల్సిన సొమ్మును సొంత ఖాతాలకు మళ్లించుకుంటూ దేవుళ్లనే అనాధలు చేస్తున్నారు. చివరకు అందుబాటులోకి వచ్చిన డిజిటల్‌ పేమెంట్‌ విధానంలో లీజు/అద్దెదారుల నుంచి సొంత ఖాతాల్లో డబ్బులు వేయించుకుంటున్న ఘటన వెలుగులోకి రావడంతో.. దేవాదాయశాఖ ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. అవినీతిని సైతం డిజిటలైజ్‌ చేయడంపై ముక్కున వేలేసుకుంటున్నారు.

రాష్ట్రంలోని కొన్ని 6(ఎ) ఆలయాల ఆస్తులకు సంబంధించిన అద్దెలు కార్యనిర్వహణాధికారుల జేబుల్లోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడైనా పై అధికారుల దృష్టికి వస్తే పైసలు పడేసి గుట్టు చప్పుడు కాకుండా సెటిల్‌ చేసుకుంటున్నారు. అంతే తప్ప ఆలయ ఆస్తుల దుర్వినియోగంపై ఏ ఒక్క అధికారిపై చర్యలు లేవని చెప్పొచ్చు. మహా అయితే విషయం బయటకు పొక్కి అల్లరి జరిగితే..కొద్ది రోజులు సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకుంటున్నారు. అసలు దేవాదాయశాఖ కమిషనరేట్‌ దృష్టికి వెళ్లకుండానే జిల్లాస్థాయిలో సెటిల్‌ చేసుకుంటున్న కేసులు అనేకం ఉన్నాయి.

- Advertisement -

అసలేం జరిగింది..

విజయవాడలోని పాతబస్తీ శివాయలంలోని శ్రీ విఘ్నేశ్వర సహిత శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయానికి గవర్నర్‌పేటలో రూ. కోట్ల విలువైన భవనం ఉంది. లీజుదారుడు నిబంధనలకు విరుద్ధంగా షాపులను కట్టించి సబ్‌ లీజుకు ఇచ్చారు. కరోనా సమయంలో లీజుదారుడు మృతి చెందడం.. కుమారుడు విదేశాలకు వెళ్లడంతో అద్దెదారులు అధికారులను ఆశ్రయించారు. అప్పటి నుంచి యజమానికి దేవాదాయశాఖ తరుపున లీజు సొమ్ము చెల్లింపుకు నోటీసులు పంపుతున్న అధికారులు.. అద్దెదారుల నుంచి నేరుగా డబ్బులు వసూలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

అక్కడ విధులు నిర్వహించే అధికారి ఫోన్‌ పే ఖాతాలోకి నేరుగా అద్దె డబ్బులు పంపుతున్నట్లు పలువురు చెపుతున్నారు. గత నాలుగేళ్లలో అద్దె దారులు రూ.లక్షల్లో అధికారుల ఫోన్‌పే ఖాతాల్లో అద్దెలు జమ చేశారు. ఇటీవల అద్దెల పెంపుపై వివాదం చోటు చేసుకోవడంతో కమిషనరేట్‌ అధికారుల దృష్టికి విసయం వెళ్లింది. కమిషనరేట్‌ అధికారుల ఆదేశాల మేరకు అధికారులు విచారణ జరిపి పలు లోపాలను గుర్తించారు.

లీజుదారులు చనిపోతే ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే కొడుకు పేరిట మ్యుటేషన్‌ ఇచ్చినట్లు గుర్తించారు. పైగా సబ్‌ లీజులు గుర్తించి కూడా చర్యలు తీసుకోకుండా నేరుగా వారి నుంచి అద్దెలు వసూలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ దేవదాయశాఖ రికార్డుల్లో అద్దె బకాయిలు చూపిస్తున్నారే తప్ప ఇప్పటి వరకు అనధికారికంగా వసూలు చేసిన మొత్తాలపై ఏ ఒక్క అధికారి కూడా సమాధానం చెప్పడం లేదు.

అసలేం చేయాలి..

దేవాదాయశాఖకు చెందిన ఆస్తులు లీజుకు ఇచ్చిన పక్షంలో నగదు చెల్లింపులకు సంబంధిత ఆలయం పేరిట రశీదులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రశీదుల ద్వారా వచ్చిన నగదు బ్యాంకులో జమ చేసినట్లు రికార్డుల్లో స్పష్టం చేయాలి. ఒకవేళ లీజుదారులు చెక్కుల రూపంలో ఇచ్చినప్పటికీ చెల్లుబాటు అయిన తర్వాత రికార్డుల్లో నమోదు చేయాలి. అంతే తప్ప సొంత ఖాతాల్లో అద్దెల సొమ్ము వేసుకోవడం చట్టరీత్యా నేరం. ఇందుకు సంబంధించి దేవదాయశాఖలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.

అయితే క్షేత్రస్థాయి అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా అందినకాడికి దండుకుంటున్నారు. గతంలో కర్నూలు జిల్లాలో ఓ కార్యనిర్వహణాధికారి పదోన్నతిపై బదిలీ అయిన నాలుగేళ్లకు కూడా గతంలో పని చేసిన ఆలయానికి చెందిన రూ.కోటి విలువైన నగలు అప్పగించలేదు. పై అధికారులు కూడా పట్టించుకోలేదు. మూడు నెలల కిందట విషయం వెలుగులోకి రావడంతో తెచ్చి అప్పగించినట్లు అధికారులు చెపుతున్నారు.

ఇన్నాళ్లు ఆలయంలో ఉండాల్సిన నగదు వేరే చోట ఉంచడం నేరమైనప్పటికీ సంబంధిత అధికారిపై చర్యలు శూన్యం. ‘తిలా పాపం-తలా పిడికెడు’ అన్న చందంగా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా జిల్లాస్థాయి అధికారులే మేనేజ్‌ చేస్తున్నారు. ఇలాంటి తీవ్రమైన నేరాలు వచ్చినప్పుడు కూడా అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం..మరికొందరిని నేరాలకు ప్రోత్సహిస్తుందనే విమర్శలు దేవాదాయశాఖలో వినిపిస్తున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement