Friday, November 22, 2024

పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి.. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

పోలవరం, ప్రభన్యూస్‌ : పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం పెరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి భద్రాచలం వద్ద 51.06 అడుగులు నీటిమట్టం నమోదవడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం నుండి 13 లక్షల 24 వేల 981 క్యూసెక్కుల వరద నీరు గోదావరిలో ప్రవహిస్తోంది. దీనికి శబరి, ప్రాణహిత నదుల నుండి వస్తున్న వరద నీరు అదనంగా చేరుతుండడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం విపరీతంగా పెరుగుతోంది.

మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి ఎగువ స్పిల్‌ వే వద్ద 33.380 మీటర్ల, దిగువ స్పిల్‌ వే వద్ద 24.650 మీటర్లు నీటిమట్టం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ నుండి 10 లక్షల 13 వేల 111 లక్షల వరద నీటిని స్పిల్‌ వే నుండి అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో సిడబ్ల్యుసి వద్ద 12.89 మీటర్లు, ధవళేశ్వరం వద్ద 3.81 మీటర్లు నమోదైనట్లు- అధికారులు తెలిపారు. గోదావరి పెరుగుతుండడంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement