విజయవాడ, ప్రభ న్యూస్: విజయవాడ సుప్రసిద్ధ దేవాలయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, ఈవో దర్భముళ్ల భ్రమరాంబ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి గిరిప్రదక్షిణను ప్రారంభించారు. గిరిప్రదక్షిణ కార్యక్రమము కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వేదపండితుల మంత్రోచ్చరణలు, అమ్మవారి నామ స్మరణలు, మంగళ వాయిద్యముల నడుమ ఇంద్రకీలాద్రి ఆలయానికి గిరిప్రదక్షిణ చేరుకుంది.
గిరిప్రదక్షిణ మార్గములో భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు, స్వామి వార్లకు భక్తిశ్రద్దలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి, పూజలు చేసి, అమ్మవారిని, స్వామి వారిని ఆరాధించి అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని భక్తుల ప్రతీతి. గిరి ప్రదక్షిణను ఫిబ్రవరి నెలలో ప్రారంభించినప్పటి నుండి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నందు భక్తులు ప్రతి నెలా పాల్గొంటున్నారు. పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ ప్రారంభించినప్పటి నుండి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, సంక్షేమం కోసం పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు.
శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి భక్తులు ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు దుర్గగుడి ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ కార్యక్రమం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, చింకా శ్రీనివాస రావు, వైదిక సిబ్బంది, వేద పండితులు, కార్యనిర్వాహక ఇంజినీర్లు కె వి ఎస్ కోటేశ్వర రావు, ఇంజినీరింగ్ సిబ్బంది, అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమంలో ఒక శునకం, కాలభైరవుడు, ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు కానీ ప్రతి పౌర్ణమి రోజున శ్రీ అమ్మవారి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షణ నందు మొదటి నుండి చివరి వరకు అందరితో పాటుగా పాల్గొనడం విశేషం…