Wednesday, November 20, 2024

అమరావతి ఉద్యమంలో పాల్గొనాల్సిందే: బీజేపీ నేతలకు అమిత్ షా ఆదేశం

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమంలో పాల్గొనాల్సిందేనని ఏపీ బీజేపీ నేతలకు తేల్చి చెప్పారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేస్తున్న పోరాటానికి అనుకూలంగా బీజేపీ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేసిన అమిత్ షా.. ఇప్పుడు దీనిపై మరో అభిప్రాయం ఎందుకని ప్రశ్నించారు. అలాగే, పొత్తులపైనా ఎవరూ నోరు మెదపొద్దని, ఈ విషయాన్ని అధిష్ఠానం తేలుస్తుందని స్పష్టం చేశారు.

ఏపీ పర్యటన చివరి రోజైన నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు, సీనియర్ నేతలు పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులతో షా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి ఉద్యమంపై ఓ నాయకుడు మాట్లాడే ప్రయత్నం చేయగా షా తీవ్రంగా స్పందించారు. అమరావతి కోసం రైతులు భూములిచ్చిన విషయం వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. అలాగే, ఉద్యమం చేస్తున్నది కూడా రైతులే అయినప్పుడు అభ్యంతరం ఎందుకని అడిగారు. ఒకసారి తీర్మానం చేశాక వెనక్కి తగ్గడం ఎందుకన్న అమిత్ షా.. పాదయాత్రలో పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీనే ఎంతసేపూ విమర్శించడం సరికాదని, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమించాలని సూచించారు. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సొంతంగా కృషి చేయాలని అమిత్ షా పార్టీ నేతలకు స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement