Tuesday, November 26, 2024

ఆర్థిక సంఘం నిధులు ఇప్పించండి.. కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శికి వినతి

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీకి కేంద్రం నుండి 14వ,  15వ ఆర్ధిక సంఘం నుండి వచ్చిన నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్రప్రభుత్వం ఇష్టానుసారంగా ఖర్చుచేయడాన్ని తప్పుబడుతూ అఖిల భారత పంచాయతీ పరిషత్‌ నేతలు మంగళవారం కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సునీల్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు అఖిల భారత పంచాయతీ పరిషత్‌ ఢిల్లీ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ జాస్తి వీరాంజనేయులు, ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ పరిషత్‌ ఉపాధ్యక్షులు ముల్లంగి రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొత్తపు మునిరెడ్డి సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 14, 15వ ఆర్థిక సంఘం 2018-2019వ సంవత్సరం రూ. 1729.23 కోట్లు, 2019-20కి సంబంధించి రూ. 2,336. 56 కోట్లు వెరసి- రూ. 4,165.79 కోట్లు కేటాయించిందన్నారు. అదేవిధంగా 2020-21కి సంబంధించి రూ. 2,600 కోట్లు-, 2021-2022కు సంబంధించి మొదటి విడతగా రూ. 969.50 కోట్లు-, రెండో దఫాగా రూ. 3590.5 కోట్లు- మొత్తం కలిపి రూ. 7665.29 కోట్ల మేర- నిధులను రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు విడుదల చేసిందన్నారు. కానీ 14, 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలు కాకుండా, సర్పంచ్‌ గ్రామ సభ తీర్మానం లేకుండా నిధులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బకాయిల పేరుతో స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈమొత్తాలను ఖర్చు చేసినందున తిరిగి ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గ్రామపంచాయతీలకు చెల్లించే విధంగా ఏర్పాటు- చేయమని కోరామన్నారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసే మొత్తం నేరుగా కేంద్ర ప్రభుత్వమే గ్రామపంచాయతీలకు చెల్లించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయమని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈసందర్భంగా కేంద్ర కార్యదర్శి సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని, టాక్స్‌ రూపంలో రావాల్సిన నిధులను గ్రామపంచాయతీలకు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం రూల్స్‌ ప్రకారం పని చేయాలని తెలిపారన్నారు ఈవిషయంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement