హైదరాబాద్: ఆడపడుచు కన్నీళ్లు ఆ ఇంటికే అరిష్టమని జగన్ గుర్తించాలని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆడబిడ్డ కన్నీరు ఆ ఇంటికి అరిష్టమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలినేని మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారం కోసం వైఎస్ విజయమ్మ ముందుకు రావాలని.. వేరే వాళ్లు దీనిలో జోక్యం చేసుకోవద్దని బాలినేని కోరారు.
ఈ విషయంలో సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా వైఎస్సార్ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆస్తులు సంపాదించుకుని పార్టీ మారినట్లు కొంతమంది వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
”నా కుమారుడి సాక్షిగా చెబుతున్నా.. వైసీపీలో ఉన్నప్పుడు నా ఆస్తులు పోగొట్టుకున్నా తప్ప సంపాదించుకోలేదు. ఆ విషయం జగన్‌కూ తెలుసు. ఎలా అన్నది మనసులో పెట్టుకున్నా. చాలా ఇబ్బంది కలిగినా ఏంటనేది బయటపెట్టలేదు. సంస్కారం ఉంది కాబట్టే దాని గురించి మాట్లాడలేదు. అప్పులైతే నా తండ్రి, కోడలి ఆస్తి అమ్మి అప్పులు తీర్చాను. ఇదీ జగన్‌కు తెలుసు. డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసినప్పుడు ఎన్నికలకు ముందే పార్టీలోకి తీసుకుందామనుకున్నట్లు చెప్పారు. కానీ జగన్‌కు బంధువులు కదా.. అడగలేకపోయానన్నారు. ఆయన హుందాగా మాట్లాడారు. వైసీపీలో బాలినేని వంటి మంచివాళ్లు ఉన్నారని అప్పట్లో చెప్పారు. జగన్ ఒంగోలు వచ్చి కూడా ఇళ్ల పట్టాల విషయంలో నా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. మంత్రి పదవి వదులుకుని జగన్ వెంట నడిచాను. ఆ పార్టీలో నాకు ఏం జరిగిందో ప్రజలకు తెలుసు” అని బాలినేని వ్యాఖ్యానించారు.