Saturday, November 23, 2024

ఎవరీ గిరిధర్‌రెడ్డి, క్వశ్చన్​ పేపర్ల లీకేజీ కేసులో కీలకం.. అతని వాగ్మూలంతోనే నారాయణ అరెస్టు

ఆంధ్రప్రభ, అమరావతి బ్యూరో : 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ దగ్గర నుండి మాజీ మంత్రి పొంగూరు నారాయణ అరెస్టుల వరకు గిరిధర్‌రెడ్డి పేరు మారుమ్రోగిపోతుంది. అసలు ఎవరీ..గిరధర్‌రెడ్డి..నారాయణ విద్యాసంస్థలకు.. ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి, లీకేజీ కేసులో ఆయన వాగ్మూలాన్ని ఆధారంగా చేసుకునే సీఐడీ నారాయణను అదుపులోకి తీసుకుంది. గత నెలలో చిత్తూరులో ప్రశ్నాపత్రాల లీకు సమయంలో పోలీసులు గిరిధర్‌రెడ్డిని అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే కీలకమైన లీకుల వ్యవహారంలో ఆయనే కీలక సాక్షిగా మారారు. దీంతో అసలు ఈ గిరిధర్‌ రెడ్డి ఎవరు..నారాయణకు, ఈయనకు ఏమిటి సంబంధం అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నారాయణ విద్యాసంస్థలు కేంద్రంగా 10వ తరగతిలో వివిధ ప్రశ్నాపత్రాలు లీక్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ దిశగా పోలీసుల ఆధీనంలో ఉన్న గిరిధర్‌రెడ్డిని తమదైన శైలిలో పోలీసులు విచారించారు. దీంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో నారాయణ విద్యాసంస్థలకు వైస్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న గిరిధర్‌రెడ్డి, సంస్థ యాజమాన్యం ప్రోద్భలంతోనే పేపర్‌ లీక్‌ చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. ఆ తర్వాతే ఆయన స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి నారాయణను అదుపులోకి తీసుకున్నారు.

గిరిధర్‌రెడ్డి.. కీలకం
సుదీర్ఘకాలంగా నారాయణ విద్యాసంస్థల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న గిరిధర్‌ రెడ్డి నారాయణకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా వ్యవహరిస్తూ వస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపధ్యంలోనే జిల్లాలో ఆయనకు అధిక ప్రాధాన్యతను నారాయణ ఇస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం నారాయణ కోసమే కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిసి ప్రశ్నాపత్రాలను లీక్‌ చేసినట్లు పోలీసులు తమ విచారణలో కూడా గుర్తించారు. నారాయణ కోసం ఎంతటి రిస్‌ ్క పనైనా చేయడంలో గిరిధర్‌రెడ్డి ముందుంటారని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో గత నెలలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కేవలం లీకేజీ వ్యవహారంలో మొదట్నుంచి కీలకంగా ఉన్న ఆయన చెప్పిన ఆధారాలను దృష్టిలో ఉంచుకుని నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరులో సంఘటన జరిగిన రోజే స్థానిక 1 టౌన్‌ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండగా, మిగిలినవారు నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో పనిచేసే అధ్యాపకులే. వారందరూ కూడా గిరిధర్‌రెడ్డి సూచనల మేరకే లీకుల వ్యవహారాన్ని అత్యంత రహస్యంగా వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement