విజయవాడ ప్రభ న్యూస్ – తెలుగు వాడుక భాషా ఉధ్యమ పితామహుడు దివంగత గిడుగు వెంకట రామమూర్తి 160 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురానున్నామని, అమ్మ బాష కమ్మదనాన్ని భావితరాలకు అందించాలన్నదే లక్ష్యమని రాష్ట్ర తెలుగు అధికార బాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు తెలిపారు. గిడుగు రామమూర్తి శతజయంతి ఉత్సవాల నిర్వహణపై తెలుగు అధికార బాషా సంఘం చైర్మన్ పి. విజయబాబు నగరంలోని కలెక్టరేట్ నందు గల పింగళి వెంకయ్య సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు తో కలిసి బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు.
మీడియా ప్రతినిధులతో విజయబాబు మాట్లాడుతూ నేటి నుండి 29వ తేదీ వరకు వారం రోజులపాటు గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం రాష్ట్రంలో ద్విభాషా విధానాన్ని ప్రోత్సహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ఆంగ్ల భాషను ప్రోత్సహిస్తూనే నిత్య జీవితంలోను, పాలనా వ్యవహారాల్లోనూ తెలుగు భాషను ప్రోత్సహించడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు గుంటూరు, విజయవాడ కేంద్రాల్లో రాష్ట్ర స్థాయి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు, రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులకు కథలు, కవితలు, అంత్యాక్షరీ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే విధంగా సాహితీ స్రష్టలను, భాషా సేవకులను, భాషా వారసత్వ పరిపుష్టతకు పాటుపడిన వారిని ఘనంగా సముచిత స్థాయిలో సత్కరించడం జరుగుతుందన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు మాట్లాడుతూ తెలుగు వాడుక బాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో ఘనంగా అధికార బాషా దినోత్సవాన్ని నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రాధమిక మాధ్యమిక ఉన్నత విద్యా సంస్థల్లో గిడుగు రామ్మూర్తి రచనలకు సంబంధించి చర్చా కార్యక్రమాలు వ్యాస రచన పోటీలను నిర్వహించనున్నామన్నారు. జిజ్ఞాస ఫౌండేషన్ సహకారంతో 26వ తేదీన చందమామ కధలు, తెలుగు సామెతలు, జానపద గీతాలు, తెలుగు సాహితీ (క్విజ్) పోటీలను నిర్వహించనున్నామన్నారు. 27వ తేదీ చిత్రలేఖనం, తెలుగు నవలా నాయకుల సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు, పోతన భాగవతం, నన్నయ మహాభారత పద్యాల పోటీలు, త్యాగరాజు, అన్నమయ్య కీర్తనల పోటీలను నిర్వహిస్తామన్నారు. నగరంలోని షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ లలో తెలుగు బాషా మహోత్సవాలపై ప్రజలను చైతన్యవంతం చేసేలా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.
పాఠశాలలు, కళాశాలలు, అంగన్ వాదీ మహిళలు, ఆశా కార్యకర్తలతో 29వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి తుమ్మలపల్లి కళా క్షేత్రం వరకూ ర్యాలీని నిర్వహిస్తామన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పురస్కారాలు అందజేయడంతో పాటు తెలుగు భాషకు విశేష సేవలు అందించిన సాహిత్యవేత్తలు, రచయితలు, కవులను ఘనంగా సత్కరించడం జరుగుతుందని కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో అధికార బాషా సంఘం సభ్యులు జి. రామచంద్రా రెడ్డి, డిఆర్ఓ కె. మోహన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.