Sunday, November 24, 2024

అభివృద్ధికి నోచుకోని గిద్దలూరు.. నంద్యాల జిల్లాలో కలపాలి..

గిద్దలూరు, (ప్రభన్యూస్) : గిద్దలూరు నియోజకవర్గాన్ని 60కిలోమీటర్ల దూరంలోని నంద్యాల జిల్లాలో కలపాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. అటువైపుగా అడుగులు వేసేందుకు ప్రజలు ఉద్యమం, ఆందోళనలు చేపట్టనున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక డిటికి వినతిపత్రం అందజేశారు. పూర్వం 1850 ముందు గిద్దలూరు, కడప జిల్లాలో ఉండేది అప్పుడు కూడా జిల్లా కేంద్రానికి 135 కిలోమీటర్ల దూరంలో చివరన వెనుకబడిన ప్రాంతంగా ఉండి అభివృద్ధికి నోచుకోలేక పోయింది.1850 తరువాత గిద్దలూరును కడప జిల్లా నుండి విడదీసి కర్నూలు జిల్లాలో కలిపారు. అప్పుడు కూడ జిల్లా కేంద్రానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉండి వెనుకబడిన ప్రాంతం కాబట్టి, 1970 సం.లో కర్నూలు జిల్లా నాయకులు గిద్దలూరు ప్రాంతం వదులుకుని కొత్తగా ఏర్పడిన ఒంగోలు జిల్లాలో గిద్దలూరును కలపడం జరిగింది, ఇది కూడా జిల్లా కేంద్రానికి గిద్దలూరు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆది నుంచి చూస్తే మన గిద్దలూరు ప్రాంతం జిల్లా కేంద్రాలకు దాదాపుగా 140 కిలోమీటర్ల దూరంలో ఉండటం జిల్లా అధికారులు కాని, పాలకులు గాని గిద్దలూరు ప్రాంతానికి వచ్చి పోవడానికి ఒక రోజు సమయం పడుతుంది. దీని కారణంగా వారి అలసత్వమో,సమయం సరిపోకనో గిద్దలూరు ప్రాంతాన్ని సందర్శించడం కరువైపోయింది. దీని వల్ల స్తానిక అధికారులు, పాలకులు సమాచారం ఇస్తే తప్ప వారికి ఇక్కడి సమస్యలు తెలిసే అవకాశం లేదు. ఇక్కడి సామాన్య ప్రజలు సమస్యలపై అవసరాల నిమిత్తం జిల్లా అధికారులకు కలవాలనుకున్న, సమస్యలను పరిష్కరించుకోవాలన్నా వ్యయ ప్రయాసాలకు లోనై ఇబ్బంది పడవలసిన పరిస్థితి. 140 కిలోమీటర్లు ప్రయాణించి తీరా జిల్లా కేంద్రానికి చేరుకొని కార్యాలయాలకు వెళితే అధికారులు సమయానికి ఉండకపోవడం, సమయం వృధా, ఖర్చు వృధా. ఇదంతా గమనిస్తే గిద్దలూరు ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేకపోవడానికి కారణం జిల్లా కేంద్రాలకు దూరంగా చివరగా ఉండటంవల్లేనని అర్థమౌతుంది.

ఇక్కడ మల్టీ స్పెషాలిటి లాంటి హాస్పిటల్స్ లేవు. ఎవరికైనా ఏవైనా ప్రమాదాలు జరిగినా ఆరోగ్య పరిస్థితి విషమించినా మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు వెళ్లాలన్నా, గుంటూరు వెళ్లాలన్నా వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్తితి, దూరం కావడంతో సమయానికి వైద్యం అందక మార్గమధ్యంలోనే రోగులు, క్షతగాత్రులు ప్రాణాలు విడిచిన సందర్భాలు ఉన్నాయి. చదువుకున్న నిరుద్యోగ యువకులు పరిశ్రమలు లేక ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది, అదేవిధంగా జలవనరులు లేవు. నల్లమల అడవులనుండి వర్షాలవల్ల వాగులు వంకలు పారినా జలాల నిల్వకు ఎటువంటి రిజర్వాయర్ లు గాని స్టోరేజ్ లు గాని లేవు. కేవలం వర్షాలపై ఆధారపడి ఇక్కడి రైతులు పంటలు పండించాల్సిన పరిస్థితి, నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తీవ్ర త్రాగునీటి సమస్య నెలకొంది. గతంలో స్వర్గీయ పిడతల రంగారెడ్డి పాలనలో ఈ ప్రాంతం కాస్త అభివృద్ధి చెందింది, ఆతరువాత గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధిని కోరే నాథుడు సాదించే నాయకులు గాని కరువయ్యారు. వెనుకబడిన గిద్దలూరు ప్రాంతానికి అభివృద్ధి చేయాలంటే కడప జిల్లా నుండి అదేవిధంగా కర్నూలు, ప్రకాశం జిల్లాల నుండి జిల్లాకు 13 మండలాలు తీసుకుని గిద్దలూరును జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించాలని, లేని ఎడల గిద్దలూరు కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్యాల జిల్లాలో పూర్వం కర్నూలు జిల్లాలో ఉన్న గిద్దలూరును నంద్యాల జిల్లాలో కలపాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

2009 వరకు గిద్దలూరు నియోజకవర్గం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం అంతర్భాగంగా ఉండేది. కనుక జిల్లా కేంద్రానికి అవసరాల నిమిత్తం వెళ్లే సామాన్య ప్రజలు వ్యయప్రయాసాలకు లోను కాకుండా బస్సులలో రైల్లలో వెళ్లి రావడానికి నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మా నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడమా లేక నద్యాలను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే అందులో విలీనం చేసి మా పశ్చిమ ప్రాంతాన్ని ఆదుకోవాలని స్తానిక ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement