చంద్రగిరి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : శ్రీనివాస మంగాపురం లో వెలసిన శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా సిద్దమైన గరుడు వాహనం పై కొలువైన విశేషాలంకార శోభతులైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి నాలుగు మాడ వీధులలో ఊరేగుతూ భక్తకోటికి కనువిందు చేశారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలేశుని కి ధరింప చేసే లక్ష్మీ కాసుల కారాన్ని టీ టీ డీ జె ఈ ఒ వీరబ్రహ్మం దంపతులు తిరుపతి నుంచి ఊరేగింపుగా మంగాపురానికి తీసుకుని వచ్చారు.
మరో వైపు తుమ్మలగుంట కల్యాణ వెంకటేశ్వర ఆలయం తరపున చంద్రగిరి ఎం ఎల్ ఎ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాల సారెను ఊరేగింపుగా మంగాపురం కు తీసుకు వచ్చారు. సాంప్రదాయ బద్ధంగా స్వామి వారికి కొత్త గొడుగుల సమర్పణ జరిగింది. ఆ హారాన్ని. వస్త్రాలను ధరించిన స్వామి వారు గరుడ వాహనం పై కొలువుతీరి భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారులవాయిద్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలలో స్థానిక శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు , టీటీడీ బోర్డు సభ్యుడు పోకల అశోక్ కుమార్, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం దంపతులు, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి , విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.