( ఆంధ్రప్రభ, విజయవాడ) : సమాజ హితమే భక్తికి పరమార్థం కావాలని, అప్పుడే కనకదుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికిపాటి నరసింహారావు అన్నారు.
దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి ఎస్ కే పి వి హిందూ హైస్కూల్ కమిటీ సంయుక్త నిర్వహణలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ప్రవచన కార్యక్రమం శనివారం విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం లో ఉన్న కేబీఎన్ కళాశాలలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ… అమ్మవారి సౌందర్యం మాత్రమే శాశ్వతమైందని, మిగిలినదంతా ఎప్పటికైనా రూపుమాసిపోతుందన్నారు. దుర్గా అనే పదాన్ని పలకటం వల్లనే కష్టాలు రూపుమాసిపోతాయన్నారు. ప్రపంచంలోనే ప్రతి అణువులను అమ్మశక్తి దాగి ఉంటుందన్నారు.
శక్తి చైతన్యాన్ని గుర్తించే ఆత్మ చైతన్యాన్ని సాధించడమే అమ్మవారి ఉపాసన రహస్యంగా గుర్తించాలన్నారు. మహాభారత యుద్ధానికి మూలంగా నిలిచిన అర్జునుడికి శక్తినిచ్చిన తల్లి కనకదుర్గాదేవి అని, దుర్గా శక్తివల్లనే పరమేశ్వరుడు కూడా తన కర్తవ్యాన్ని నిర్వహించగలుగుతున్నాడని అన్నారు.
జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించిన కనకదుర్గానంద లహరి లోని శ్లోకాలను రాగ భావ యుక్తంగా గరికపాటి గానం చేసిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ కార్య నిర్వహణ అధికారి కె.ఎస్.రామారావు, హిందూ హై స్కూల్ కమిటీ అధ్యక్షుడు టి శేషయ్య, కెబీఎన్ కళాశాల కార్యదర్శి టి శ్రీనివాసు గరికపాటిని ఘనంగా సత్కరించారు.