Tuesday, November 19, 2024

Gannavaram ఎయిర్ పోర్ట్ విస్తరణ జూన్ లోగా పూర్తి – కేంద్రమంత్రి

ఎయిర్‌పోర్టు ప‌నుల‌ను లేట్ చేయొద్దు
వచ్చే జూన్ వ‌ర‌కే టార్గెట్
పనుల్లో జాప్యం దేనికి అవుతోంది
నిధులు.. మెటీరియల్‌కు కొరత లేదు
వరదలొచ్చాయ‌నే వంక చూపొద్దు
రోజువారీ పని వివరాలు వాట్సాప్‌లో అప్‌డేట్‌ చేయండి
విజయవాడ విమనాశ్రయ పనులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ సీరియస్

ఆంధ్రప్రభ స్మార్ట్, గన్నవరం (కృష్ణాజిల్లా) :
నిధులకు కొరత లేదు. మెటీరియల్ ఉంది. కానీ పనులు ఎందుకు సాగటం లేదు. ఇకమీద‌ట‌ అలా కుదరదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ‌నివారం గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల తీరుపై సీరియ‌స్ అయ్యారు. రోజూ చేసిన పని చేసినట్టు వాట్సాప్‌లో అప్‌డేట్ చేయాల‌ని ఆదేశించారు. ప్రతి నెల ఈ పనుల పురోగతిని రివ్యూ చేస్తాన‌ని చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీలు బాలశౌరి, సీఎం రమేష్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సాధారణ పరిపాలన విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఇతర అధికారులతో కలిసి విజయవాడ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు.

- Advertisement -

వ‌చ్చే జూన్ వ‌ర‌కు పూర్తి కావాలి..

విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనులు అత్యంత వేగంగా జ‌రగాల‌ని, జూన్ 2025 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ అన్నారు. ఆ దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. విమానాశ్రయ అభివృద్ధి పనులు ఇప్పటి వరకు 52 శాతం మాత్రమే పూర్తి చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిధులు, మెటీరియల్ కొరత లేకపోయినా పనుల ఆలస్యానికి కారణాలపై ఆరా తీశారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పనులు కొంతమేర మందగించాయని, వేగవంతం చేసి నిర్దేశిత సమయానికి పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

విజయవాడ విమానాశ్రయ విస్తరణలో భూ సమస్యలు, కోర్టు వివాదాలు, ఏలూరు కాల్వపై వంతెన నిర్మాణం, రైతులకు పరిహారం చెల్లింపు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో గన్నవరం విమానాశ్రయ జనరల్ మేనేజర్ రామాచారి, డైరెక్టర్ లక్ష్మీ కాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement