Saturday, November 23, 2024

ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో గ్యాంగ్‌రేప్‌ ఏపీకే అవమానం.. నిందితులను ఉరి తీయాలి: చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ : మతిస్థిమితం లేని యువతిపై ప్రభుత్వ ఆసుపత్రిలోనే గ్యాంగ్‌రేప్‌ జరగడం ఏపీకే అవమానమని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన అత్యంత దారుణమని, దీనికి ప్రతి ఒక్కరు సిగ్గుపడాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలిని చంద్రబాబు పరామర్శించారు. ఆ యువతి తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆడబిడ్డను మోసం చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి 30 గంటల పాటు ఒక గదిలో బంధించి ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధమవుతుందన్నారు. బాధిత యువతి చెప్పిన విషయాలు వింటే తన కడుపు తరుక్కుపోయిందని అన్నారు. మానసిక వికలాంగురాలిపై ముగ్గురు వ్యక్తులు 30 గంటల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడటం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అన్నారు.

ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గుందో లేదో తెలియదు కానీ ప్రజల మనిషిగా, ప్రతిపక్ష నేతగా తాను సిగ్గుపడుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. బాధితురాలిని స్వయంగా వచ్చి ఓదార్చాల్సిన ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లాకు వెళ్లారని, ఆయన వెళ్లాల్సింది అక్కడికి కాదు, ఇక్కడికని అన్నారు. ముఖ్యమంత్రి వచ్చి పరామర్శించి రాష్ట్ర మహిళలందరికీ భరోసా కల్పించేలా వ్యవహరించి ఉంటే తాను కూడా మెచ్చుకునేవాడినని ఆడబిడ్డల విలువ ఈ ప్రభుత్వానికి తెలియదని విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధితురాలి తండ్రి కుమార్తె ఆచూకీ దొరక్క పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వెతుక్కోమని సమాధానం చెప్తారా అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధిత కుటుంబమే యువతిని వెతుక్కునేందుకు వెళ్లిందని అక్కడ పరిస్థితి చూసి వారి కడుపు రగిలిపోయిందన్నారు. ఇంత జరిగితే ఇది ప్రభుత్వానికి అవమానం కాదా? పాలించే అర్హత ఉందా అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.

గతంలో సీఎం నివాసానికి సమీపంలోనే యువతిపై కాబోయే భర్త ముందు అత్యాచారం చేస్తే ఆ దుర్మార్గులను పట్టుకున్నారా? శిక్షించారా అని నిలదీశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కోసం ఒక కుటుంబాన్ని నడిరోడ్డుపై నిలబెట్టి కారు తీసుకువెళ్లారని దీనిని ఖండకావరం అనాలా లేక ఉన్మాదం అనాలా అంటూ నిప్పులు చెరిగారు. ప్రజలు తిరగబడితే పారిపోతారని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు, ఆడబిడ్డల మానాలకు రక్షణ లేదని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు పట్టుబడినా రాష్ట్రం పేరే వినిపిస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గంజాయి, మద్యం, డ్రగ్స్‌ వాడకం పెరగడం వల్లే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని అన్నారు. దశ చట్టాన్ని తీసుకువచ్చామని ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిందని అసలు లేని దిశ చట్టంతో శిక్షలు వేస్తామని అంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి తన చెంచాలతో మాట్లాడిస్తే భయపడమని, ప్రజల పక్షాన పోరాటాలను చేస్తామని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు తమను తాము కాపాడుకునేందుకు పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన దారుణంగా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కేసు విచారణను వేగంగా పూర్తిచేసి ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష వేయించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

బాధితురాలికి రూ. 5 లక్షల ఆర్థికసాయం
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు గౌరవప్రధంగా జీవించేందుకు తమ పార్టీ అండగా ఉంటుందని, పార్టీ తరుపున రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే ప్రభుత్వం కూడా ఈ ఘటనపై తక్షణమే స్పందించి బాధిత యువతికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ. కోటి పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధితురాలిని పరామర్శించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement