తిరుపతి సిటీ, మే1 (ప్రభ న్యూస్): తిరుమల శ్రీవారి ఆశీస్సులతో అంగరంగ వైభగంగా, ఎవరూ వూహించని విధంగా శ్రీవారి చెల్లెలు గంగమ్మతల్లి జాతర బ్రహ్మోత్సవాల నిర్వహణ ఉంటుందని స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. సోమవారం తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయ పున: ప్రతిష్ట శ్రీకారం మహా కుంభాభిషేకం కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు, మేయర్ డాక్టర్.శిరీషా, ఉప మేయర్ భూమన అభినయ రెడ్డి మహా కుంభాభిషేకం సందర్భంగా మొదటి రోజు పాల్గొన్నారు. అందరూ కుటుంబ సమేతంగా వచ్చి మహా కుంభాభిషేకంకు సంబంధించిన ప్రధాన కలశం మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దేవత ఆవాహనం, స్వర్ణ యంత్రమును వారి చేతుల మీదుగా ఆలయ ప్రదర్శనం నిర్వహణతో 70మంది వేద పండితులచే ఈ మహా కుంభాభిషేకం కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ… గత వేయి సంవత్సరాల క్రితం తిరుమల శ్రీవారి ప్రథమ శిష్యుడు అనంత ఆల్వార్ అమృత హస్తాలతో శ్రీవారి చెల్లెలు తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయ పున: ప్రతిష్ట జరిగిందని, నేడు మరోమారు వారి వంశస్థులు 22వ తరం కస్తూరి రంగన్, వేద పండితులు యాగ నిర్వహణకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ ఏడాది ఈ మాసంలో 9వ తేది నుండి 16వ తేదీ వరకు జరిగే తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆశీస్సులతో అంగరంగ వైభవంగా నిర్వహించ నున్నామన్నారు. అనంతరం గంగమ్మ తల్లి జాతర బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యత తెలిపే ప్రచార వాహనాలను ప్రారంభించారు. దేశంలోనే మొదటి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ తల్లి వైభవాన్ని జగమంతా చాటుదామన్నారు. క్రేడాయ్, తిరుపతి చైర్మన్ శ్రీనివాసులు, ప్రెసిడెంట్ రామప్రసాద్, ట్రెజరర్, సభ్యులు కలసి గంగమ్మ జాతర నిర్వహణకు తమవంతుగా రూ.10 లక్షల చెక్కును స్థానిక శాసన సభ్యులు అందించారు. ఆలయ ఛైర్మన్ కట్టా గోపి యాదవ్, ఆలయ కార్యనిర్వహణాధికారి యం.ముని కృష్ణయ్య, ధర్మకర్తల మండలి సభ్యులు టి.వెంకటేశ్వరరావు, టి.రమణమ్మ, పి.ధన శేఖర్, వి.కృష్ణమ్మ, యం.భారతి, ఆలయ అర్చకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.