Friday, November 22, 2024

నెల్లూరులో గబ్బర్​సింగ్: వాహనదారులపై దురుసు ప్రవర్తన, చార్జిమెమో ఇచ్చిన ఎస్పీ!

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఒక పోలీసు సబ్​ ఇన్‌స్పెక్టర్ వాహనదారుడితో దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాస్క్​ పెట్టుకోలేదన్న కారణంగా ఒక వాహనదారుడిని దూషించి, తప్పుగా వ్రవర్తించిన ఘటనలో జిల్లా ఎస్పీ నుంచి తాఖీదు కూడా అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో హల్​చల్​ కావడంతో జిల్లా ఎస్పీ విజయరావు సదరు ఎస్సైకి చార్జి మెమో ఇచ్చినట్టు సమాచారం.

కాగా, గబ్బర్ సింగ్ అని అందరూ ముద్దుగా పిలుచుకునే ఈ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) వెంకటరమణ.. ఓ వాహనదారుడు మాస్క్​, హెల్మెట్ లేకుండా వెళ్తున్న బైకర్‌ను పట్టుకున్నాడు. అంతేకాకుండా నెల్లూరు మండలం మర్రిపాడు గ్రామంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండానే అతను బైక్​ నడుపుతున్న విషయం తనిఖీల్లో తెలిసింది. దీంతో వాహనదారుడిని పట్టుకుని జరిమానా చెల్లించాలని కోరాడు. దీనికి ఆ బైకర్​ పెనాల్టీ చెల్లించేందుకు నిరాకరించడంతో  సబ్​ ఇన్స్పెక్టర్ కు కోపం వచ్చింది. ఇక అక్కడికక్కడే అతనిని బహిరంగంగా దూషించి, బైక్​పైనుంచి లాక్కొచ్చాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్‌గా మారడంతో జిల్లా పోలీసు అధికారులు అలర్ట్​ అయ్యారు. ఆ వీడియోలో ఎస్​ఐ బైకర్ కాలర్ పట్టుకుని లాగడం చూడవచ్చు. దీంతో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) వెంకటరమణపై బాధితుడు కంప్లెయింట్​ చేశాడు. కాగా, ఈ విషయమై మర్రిపాడు మండల డీఎస్పీని పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) విజయరావు నివేదిక కోరారు. ఘటన అనంతరం ఎస్‌ఐని ఎస్పీ పిలిపించి మందలించి, చార్జి మెమో ఇచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement