ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఒక పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ వాహనదారుడితో దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాస్క్ పెట్టుకోలేదన్న కారణంగా ఒక వాహనదారుడిని దూషించి, తప్పుగా వ్రవర్తించిన ఘటనలో జిల్లా ఎస్పీ నుంచి తాఖీదు కూడా అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో జిల్లా ఎస్పీ విజయరావు సదరు ఎస్సైకి చార్జి మెమో ఇచ్చినట్టు సమాచారం.
కాగా, గబ్బర్ సింగ్ అని అందరూ ముద్దుగా పిలుచుకునే ఈ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) వెంకటరమణ.. ఓ వాహనదారుడు మాస్క్, హెల్మెట్ లేకుండా వెళ్తున్న బైకర్‌ను పట్టుకున్నాడు. అంతేకాకుండా నెల్లూరు మండలం మర్రిపాడు గ్రామంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే అతను బైక్ నడుపుతున్న విషయం తనిఖీల్లో తెలిసింది. దీంతో వాహనదారుడిని పట్టుకుని జరిమానా చెల్లించాలని కోరాడు. దీనికి ఆ బైకర్ పెనాల్టీ చెల్లించేందుకు నిరాకరించడంతో సబ్ ఇన్స్పెక్టర్ కు కోపం వచ్చింది. ఇక అక్కడికక్కడే అతనిని బహిరంగంగా దూషించి, బైక్‌పైనుంచి లాక్కొచ్చాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జిల్లా పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ వీడియోలో ఎస్‌ఐ బైకర్ కాలర్ పట్టుకుని లాగడం చూడవచ్చు. దీంతో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) వెంకటరమణపై బాధితుడు కంప్లెయింట్ చేశాడు. కాగా, ఈ విషయమై మర్రిపాడు మండల డీఎస్పీని పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) విజయరావు నివేదిక కోరారు. ఘటన అనంతరం ఎస్‌ఐని ఎస్పీ పిలిపించి మందలించి, చార్జి మెమో ఇచ్చినట్టు తెలుస్తోంది.