Saturday, November 23, 2024

విశ్వనగరి విశాఖ వేదికగా జీ-20 సదస్సు.. ప్రారంభమైన సదస్సు సన్నాహాలు

విశాఖపట్నం ప్రభన్యూస్‌: ప్రతిష్టాత్మక జీ-20 సదస్సుకు విశాఖ మహానగరం వేదికకానున్నది. మార్చి 28,29,30 తేదిల్లో మూడు రోజులపాటు జీ-20 సదస్సు జరగనున్నాయి. ఈ సదస్సును సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సదస్సులో ప్రజల్ని భాగస్వాములను చేస్తూ పౌరులందరికీ జీ-20పై అవగాహన కలిగేలా జనసంచారం అధికంగా ఉండే ఆర్కే బీచ్‌లో బోట్‌రేసింగ్‌, గాలిపటాల పోటీలను గురువారం ప్రారంభించారు. ఇప్పటికే విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందేలా నగరాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. జీ-20 సదస్సుకు 40దేశాల నుంచి 200వరకూ దేశ విదేశీ ప్రతినిధులు హజరుకానున్నారు. వారితోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మ్మోహన్‌ రెడ్డి,కేంద్ర మంత్రులు తదితర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతి,ప్రయాణ ఏర్పాట్లు చేయడం కోసం అధికార యంత్రాంగం నిమగ్నమైంది.

ప్రతిష్టాత్మకమైన జీ-20సదస్సులో వైజాగ్‌ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తంగా ఇనుముడిరప చేసేలా చర్యలు చేపట్టారు. ఇప్పుడు విశాఖ మహానగరం ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం కన్పిస్తోంది. ముఖ్యంగా సాగరతీరం అందంతోపాటు.. ఆకర్షణీయంగా విద్యుత్‌ సుందీకరణలతో దేదిప్యమానంగా అద్దంలా మెరిసిపోతోంది. ఈ సదస్సు విజయవంతమయ్యేలా ప్రజలను సైతం భాగస్వాములను చేసేందుకు పలురకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జీ-20 సదస్సుకు వేలాది మంది వివిధ దేశాల ఆర్థిక మంత్రులు, విదేశాంగ మంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్లు జీ-20 సదస్సులో పాల్గొననున్నారు. తదనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసేందుకు గురువారం జిల్లాకలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున, విశ్వనాథన్‌, డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజుబాబు వివిధ శాఖల అధికారులతో సమావేశమై దిశానిర్ధేశం చేశారు.

జీ-20 సదస్సు నిర్వహణకు మొత్తం15కమిటీలను ఏర్పాటు చేసి.. జేసీవిశ్వనాథన్‌ నోడల్‌ అధికారిగా నియమించారు. అతిథుల కోసం నగరంలోని స్టార్‌ హోటళ్లలో 703 గదులను రిజర్వ్‌ చేసేందుకు చర్యలు చేపట్టారు. అతిథులు పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశీ ప్రతినిధులు బసచేసే హోటల్స్‌, విమానాశ్రయం వద్ద 24/7 హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. జీ-20 సదస్సు తొలిరోజు అంటే 28న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మ్మోహన్‌ రెడ్డి నగరానికి చేరికుంటారు. అలాగే రాష్ట్రస్థాయి మంత్రులు, కార్యదర్శులు, ఇతర రాష్ట్రస్థాయి అధికారులకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి కమిటీలను ఏర్పాటు చేశారు.

- Advertisement -

మహానగరానికి అరుదైన గౌరవం

గ్రేటర్‌ విశాఖ నగరానికి అరుదైన గౌరవం దక్కింది. జీ-20 అధ్యక్ష దేశంగా భారత్‌ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఏడాదిపాటు సదస్సులు, వివిధ ప్రాంతాల్లో పలు రకాల కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని 56నగరాలు, పట్టణాల్లో వివిధ అంశాలకు సంబంధించి 200 సదస్సులు నిర్వహించబోతోంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మహా విశాఖనగరాన్ని కేంద్రం ఎంపిక చేసింది.ఈనేపధ్యంలో విశాఖలో మార్చి 28, 29, 30తేదీల్లో మూడు రోజులు జరిగే ఈ సదస్సులో ఆర్థిక రంగం, వ్యవసాయం, పర్యావరణం, విద్య, వైద్యం తదితర అంశాలపై 37 సమావేశాలు జరుగుతాయని జిల్లా అధికా రులు ఇప్పటికే వెల్లడిరచారు. ఇప్పటికే జీ-20లో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేం నగరంలో రాడిసన్‌ బ్లూ హోటల్‌లో 22న జరిగింది.

జనభగీదారి కార్యక్రమంలో భాగంగా డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ ఆఫైర్స్‌, హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ ఆఫైర్స్‌ మంత్రిత్వశాఖ, ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా ఈనెల 22న ప్రాంతీయ వర్క్‌ షాప్‌ను ట్రైయిల్‌ రన్‌ నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలశాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ ప్రారంభించిన సదస్సులో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, చత్తీస్‌గఢ్‌, ఒడిశా, లక్షద్వీప్‌, పుదుచ్ఛేరిలనుంచి పురపాలక కమిషనర్లు, మేయర్లు, అర్బన్‌ స్టేట్‌ డిపార్టుమెంట్ల ప్రతినిధులు హజరయ్యారు. రెండో దశ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌గ్రూప్‌(ఐడబ్ల్యూజే) సమావేశం ఈనెల 28, 29 తేదీల్లో జరగనుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశానికి హజరయ్యే ప్రతినిధులు ముడసర్లోవ రిజర్వాయర్‌లోని సోలార్‌ ప్రాజెక్టు,కాపులుప్పాడలోని జిందాల్‌ రీసైక్లింగ్‌ ప్లాంట్‌,జీవీఎంసీలోని కమాండ్‌ కంట్రోల్‌ ఆపరేషన్‌, తాగునీటి ప్రాజెక్టు, కైలాసగిరి ప్రాంతాలను సందర్శించారు.

ఐకానిక్‌గా సాగరతీరం

స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకూ నగరాన్ని సుందరీకరించడం, విద్యుత్‌దీపాల ఏర్పాటు, ప్లాంటేషన్‌, పౌంటెన్ల ఏర్పాటు ప్రత్యేకంగా చేపడుతున్నారు. సదస్సుకు విచ్చేసే ప్రతినిధులకు పర్యాటక ప్రాంతాలను సైతం సందర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్కేబీచ్‌తోపాటు, రుషికొండ, తొట్లకొండ, శిల్పారామం ప్రాంతాలను సైతం శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేలా గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ సం(జీవీఎంసీ) రూ.150 కోట్ల కేటాయించి, నగరాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దుతున్నారు.

నగర సుందరీకరణతో పాటు, రహదారులు, ఇతర పర్యాటక, ఆద్యాత్మిక ప్రాంతాలను సైతం మరింత ఆకర్షణీయంగా సుందీకీరణ చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్కేబీచ్‌ ప్రాంతాన్ని ఓఐకానిక్‌గా తీర్చిదిద్దేలా అన్ని చర్యలు చేపట్టారు. సదస్సుకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్న లైజినింగ్‌ ఆఫీసర్ల నియామకంతో పాటు, వార్డు సెక్రటరీల సేవలను వినియోగించుకుని సదస్సును విజయవంతం అయ్యేలా జిల్లా ఉన్నతాధికారులతో పాటు నగర మేయర్‌ కూడా సదస్సు విజయవంతమయ్యేలా కృషి చేస్తున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా బీచ్‌ రోడ్డు సీతకొండ వ్యూ ఫాయింట్‌

ఆర్కేబీచ్‌, సాగర్‌నగర్‌, రుషికొండ బీచ్‌ వంటి ప్రాంతాలను వీక్షించించడానికి ప్రాంతాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఆర్కేబీచ్‌ నుంచి పెద రుషికొండ వరకు రహదారులు, డివైడర్లు, విద్యుత్‌ కాంతులతో సుందరీకీరణ చేపట్టారు. అతిథులను ఆకట్టుకునేలా జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్‌, గుడ్లవానిపాలెం బీచ్‌లు విశేషంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగేలా ఆకర్షణీయంగా సుందరీకరించారు. జోడుగుళ్లపాలెం సీతకొండ మలుపు వద్ద పర్యాటకులు సముద్ర అందాలను వీక్షించేందుకు వ్యూపాయింట్‌ వద్ద ఐ లవ్‌యూ వైజాగ్‌ నేమ్‌ బోర్డు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సీతకొండ బండరాళ్లపై బొమ్మలు వేశారు. రాత్రుళ్లు కూడా బండరాళ్లపై గీసిన బొమ్మలు, కొండపై గ్రీనరీ కన్పించేలా లైట్లు ఏర్పాటు చేయడంతో సందర్శకులు, పర్యాటకులకు ఈప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇస్కాన్‌ ఆధ్యాత్మిక టెంపుల్‌ ఎదురుగా ఉన్న బీచ్‌ రోడ్డు డివైడర్‌ మద్యలో చెట్లుకు ఈస్టమన్‌ కలర్‌పుల్‌ రంగులు వేయడంతో ఆప్రాంతమంతా శోభయామానంగా కనువిందు చేస్తోంది. ఇలా నగరంలోని ప్రతిచోట దేశ ఔన్నత్యాన్ని చాటేలా పలు ప్రాంతాలను సుందీకరణ చేశారు.

జీ-20 సదస్సుపై అవగాహన కార్యక్రమాలు

విశాఖలో జరిగే ప్రతిష్టాత్మకమైన జీ-20 సదస్సుపై జిల్లా ప్రజలకు అవగాహన కలిగేలా పలు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. గురువారం ఆర్కేబీచ్‌లో వైజాగ్‌ బ్రాండ్‌ని ఇనుముడిరప చేసేలా జీ-20 సమ్మిట్‌ పేరుతో సాగర్‌నగర్‌, ఆర్కేబీచ్‌ సముద్రంలో 30 బోట్లతో బోట్‌ రేసింగ్‌ ఏర్పాటు చేశారు. అలాగే ప్రజలను భాగస్వాములను చేసే విధంగా ఆకాశంలో రంగురంగుల గాలిపటాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నగర మేయర్‌ హరి వెంకట కుమారి ప్రారంభించారు. దేశ విదేశాల నుంచి వచ్చే దేశ విదేశీ ప్రతినిధులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చూపించాలని నగర మేయర్‌ పిలుపు నిచ్చారు. సదస్సు లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు కార్యక్రమాలు ఉగాది పర్వదినం సందర్భంగా ప్రారంభమయ్యాయి.

యోగా ఆల్‌ పేరిట వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్కు, వుడా పార్కులలో యోగా తరగుతులను ఆంధ్రా యూనివర్శిటీ వైస్‌చాన్సలర్‌ ఆచార్య ప్రసాద్‌ రెడ్డి ప్రారంభించారు. జీ0-20 వైజాగ్‌-2023 బ్రాండిరగ్‌ పేరట ఆర్కేబీచ్‌, సాగర్‌నగర్‌లలో బోట్‌ రేసింగ్‌, కైట్‌ ఫిస్టెవల్‌ను నగర మేయర్‌ హరికుమారి ప్రారంభించారు. ఏయూ వీసీ ఆధ్వర్యంలో ఈనెల 24న మాక్‌ జీ 20 కాన్‌క్లేవ్‌ పేరిట ఆంధ్రా యూనివర్శిటీ కన్వెన్షన్‌ హాల్‌లోవిద్యార్థులకు జీ 20సదస్సుపై అవగాహన కల్పించనున్నారు. 25న చిత్రలేఖనం పోటీలు, 26న వైజాగ్‌ సిటీ మారథాన్‌, వైజాగ్‌ కార్నివాల్‌ పేరిట థింసా నృత్యప్రదర్శన, కోలాటం, వీరనాట్యం వంటి జానపద నృత్యాలు, భారత శాస్త్రియ నృత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement