Tuesday, October 22, 2024

Future Game Changer – డ్రోన్ అంటే వార్ కాదు.. డెవ‌ల‌ప్‌మెంట్‌: చంద్రబాబు

వ్యవసాయం, ఆరోగ్యం, మౌలిక రంగాల్లో ఇవే కీలకం
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
దేశాభివృద్ధి, మాన‌వ మ‌నుగ‌డ‌లో కొత్త‌ సాంకేతిక‌త‌
శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో డ్రోన్ల వినియోగం పెరిగింది
విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల స‌మ‌యంలోనూ వినియోగించాం
మ‌నుషులు వెళ్ల‌లేని ప్రాంతాల‌కు డ్రోన్ల‌తో సాయం చేశాం
డ్రోన్ల త‌యారీ రంగానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు..
ఓర్వ‌క‌ల్లులో మూడొంద‌ల ఎక‌రాల‌ను కేటాయిస్తాం
డ్రోన్ స‌మ్మిట్‌లో స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు
మంగ‌ళ‌గిరిలో ఘ‌నంగా కార్య‌క్ర‌మం..
ఆక‌ట్టుకున్న భారీ ప్ర‌ద‌ర్శ‌న‌..
ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన 5500 డ్రోన్లు

మంగ‌ళ‌గిరి – ఇజ్రాయేల్ సహా అనేక దేశాల మధ్య డ్రోన్లతో యుద్ధం నడుస్తోంది. ఆయా దేశాలు యుద్ధం కోసమే డ్రోన్‌ల‌ను ప్రయోగిస్తున్నాయి. కానీ, మనం దేశ అభివృద్దికి, మానవ మనుగడకు డ్రోన్లను వినియోగిద్దాం.. అమరావతి అంటే ప్రపంచంలోనే డ్రోన్ సిటీగా మారుద్దాం, ప్రతి సమస్యను డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో పసిగడదాం, పరిష్కరిద్దాం. డ్రోన్ అంటే బాంబులు కురింపే ఆయుధం కాదు.. వ్యవసాయం, విద్యుత్తు, రోడ్లు, కడకు పంచాయతీల్లో పారిశుద్ధ్య సమస్యనూ డ్రోన్లతో తెలుసుకుని తక్షణమే పరిష్కార మార్గాన్ని అన్వేషిద్దాం అని సీఎం చంద్రబాబు స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌గిరిలోని సికె క‌న్వేన్ష‌న్ హాలులో మంగ‌ళ‌వారం డ్రోన్ స‌మ్మిట్‌ను ఆయ‌న ప్రారంభించారు.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీని డ్రోన్ హబ్ గా మార్చడమే ఈ సదస్సు లక్ష్యం అన్నారు.

- Advertisement -

డ్రోన్ ఎకో సిస్ట‌మ్ ఏర్పాటు..

ఇప్పటికే వ్యవసాయం, శాంతిభద్రతల అంశాల్లో డ్రోన్లు వినియోగిస్తున్నామని, రాష్ట్రంలో డ్రోన్ ఎకో సిస్టమ్‌ను తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని సీఎం చంద్ర‌బాబు వివరించారు. ఎవ్వరయినా ఏపీకి రావాలంటే సరైన సదుపాయాలు లేవన్నారని, దాంతో తాము ఓపెన్ స్కై పాలీసీ తీసుకువచ్చిన‌ట్టు తెలిపారు. అయిదు వే ల ఎకరాల భూమిని సేకరించి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు నిర్మించామన్నారు. ఆ త‌ర్వాత ఒకదాని త‌ర్వాత‌ మరోటి ముందుకు తీసుకు వెళ్లామని, శంషాబాద్ ఎయిర్ పోర్టు కోసం సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీతో 32 సార్లు సమావేశం అయ్యామన్నారు. ఇప్పడు చెపుతన్నా.. హైదారాబాద్ ఇండియాలో చాలా బెస్ట్ సీటీ అని, ఇండియా బ్రాండ్ ను ప్రధాని మోదీ ప్రమోట్ చేశారని, డిజిటల్ కరెన్సీ విషయంలో రిపోర్టు ఇవ్వాలని ప్రధాని అడిగితే ఇచ్చామని చెప్పారు. ఇప్పడు అత్యధికంగా డిజిటల్ కరెన్సీ వినియోగిస్తున్న దేశం ఇండియా అని తెలిపారు. మంగళగిరిలోని సీకె కన్వెన్షన్ లో 5500 డ్రోన్స్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నారు. ఈ సదస్సును విజయవంతం చేయటానికి పది మంది ఐఏఎస్ లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ సదస్సులో 6000లకు పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

డేటానే భవిష్యత్తు సంపద

భవిష్యత్తులో డేటా ఆస్తిగా మారుతుందని, మీ దగ్గర డేటా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగంతో అద్బుతాలు సృష్టించవచ్చని చంద్రబాబు అన్నారు. డ్రోన్ లకు ప్రోగ్రాం ఇచ్చి సమాచారం సేకరించవచ్చన్నారు. వరదల సమమంలో బాధితులకు ఆహారాన్ని డ్రోన్లతో పంపిణీ చేశామన్నారు. హెలికాప్టర కంటే డ్రోన్ లతోనే ఫలితం దక్కిందన్నారు. లక్షా 50 వేల మందికి డ్రోన్ లతో ఆహరం అందించామన్నారు. సిటీలో ఎంత చెత్త పేరుకుపోయిందో డ్రోన్ లు పంపి తెలుసుకున్నామన్నారు. దీంతో 20 వేల టన్నుల చెత్తను వెంటనే ఎత్తేశామని, రేపు ఇదే డ్రోన్ ఓ గేమ్ చేంజర్ అవుతందని ఆయన పేర్కొన్నారు.

దీన్ని వ్యవసాయం, మౌలిక సదుపాయాలు విషయంలో అద్బుతాలు సాధించొచ్చునని అన్నారు. సీసీ కెమెరా ముఖ్య ప్రాంతాల్లో బిగించగలం, రౌడీషీటర్ల సంచారం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన. మందుబాబుల అల్లర్లు జరగకుండా చూస్తున్నామని, భవిష్యత్తులో తప్పుచేసి వారిని పట్టుకోవడానికి డ్రోన్‌లు వాడుతామని చెప్పారు. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మీకు చెప్పదల్చుకున్నానని.. డ్రోన్ తయారీ దారులకు ఈ సదస్సు ద్వారా ఓ అవకాశం వస్తుందన్నారు. ఇప్పుడు కొన్ని దేశాలు డ్రోన్ లను యుద్దాలకోసం వాడుతున్నారని.. తాను మాత్రం డ్రోన్ లతో అభివృద్ది సాధిస్తానని స్పష్టం చేశారు.

ఓర్వకల్లులో 300 ఎకరాలు ఇస్తాం

డ్రోన్ల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తే కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల భూమిని ఇస్తామని సీఎం డ్రోన్ కంపెనీలకు ఆఫర్ ఇచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు సెంటర్ పాయింట్ అని, ఓర్వకల్లు నుంచి సునాయసంగా, తర్వగా చేరుకోవచ్చన్నారు. డ్రోన్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న బ్లాంక్ చెక్ అన్నారు. ఒకప్పుడు సెల్ ఫోన్ ను వ్యతిరేకించారని, ఇరవై వేల రూపాయల విలువ చేసే సెల్ ఫోన్ ధర ఇప్పుడు రెండువేలకే పడిపోయిందని, కానీ వ్యాపారం తగ్గలేదన్నారు. డ్రోన్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను అందరికీ అందుబాటులోకి తీసుకు రావలన్నారు. డ్రోన్ మార్కెటింగ్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు.

డ్రోన్ దీదీ పథకంలో మహిళలకు ఉపాధి.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ‘‘నేను మంత్రిని అయ్యాక చాలా మంది పీఏంలు ఎయి‌ర్‌పోర్టులు, హెలిపోర్టుల గురించి అడిగారు. ఏపీ సీఎం మాత్రం ఎయిర్‌ పోర్టులతో పాటు కనెక్టివిటీ, డ్రోన్‌ల ప్రాధాన్యం గురించి మాట్లాడారు’’ అని తెలిపారు. గత పది సంవత్సరాలుగా సివిల్ ఏవియేషన్‌లో ఎన్నో అద్భుతాలు జరిగాయన్నారు. అంతకుముందు ఇండియాలో 74 ఎయిర్‌ పోర్టులు ఉంటే.. ఇప్పుడు 157 ఎయిర్‌పోర్టులు ఏర్పాటయ్యాయన్నారు. రానున్న రోజుల్లో వీటిని మంరింతగా పెంచుతామని స్పష్టం చేశారు. డ్రోన్‌లో వర్టికల్ టేకాఫ్‌ అండ్ ల్యాండింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందన్నారు. ఇలాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీకి తేవాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తారన్నారు.

ఈ డ్రోన్ సెక్టర్‌లో ఇక్కడి వారు ముందుకు రావాలని.. నిర్మాణాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అందుకే డ్రోన్ రూల్స్ 2021ను చాలా సరళతరం చేశామని వెల్లడించారు. దీనికి అదనంగా డ్రోన్ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నామని.. డ్రోన్ ఇండస్ట్రీపై మరింత రీసెర్చి జరగాలనేది తమ అభిమతమన్నారు. 26,500 డ్రోన్‌లు రిజిస్టర్ అయి ఉంటే ప్రధాని దాన్ని లక్షకు చేర్చాలని చెప్పారన్నారు. డ్రోన్ దీదీ ప్రోగ్రాం ద్వారా దేశంలో మహిళలకు ఉపాధి కూడా కలుగుతోందన్నారు. ఏపీ ఇప్పుడు డ్రోన్ పాలసీని రూపొందిస్తోందని.. అందరితో మాట్లాడి దాన్ని రూపొందించడంతో ఇదే బెస్ట్ పాలసీ అవుతుందని స్పష్టం చేశారు.

ఆకట్టుకున్న భారీ సదస్సు

ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ డ్రోన్ సమ్మిట్‌ 2024 మంగళవారం ఉద‌యం మంగళగిరిలోని సీకే క‌న్వెన్షన్ సెంట‌ర్లో ప్రారంభమైంది. డ్రోన్ సాంకేతికత, పరిశోధన, ఉత్పత్తి, శిక్షణ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం రెండురోజుల పాటు డ్రోన్ సమ్మిట్ నిర్వహించనుంది. దేశంలోనే తొలిసారిగా 5,500 డ్రోన్లతో ప్రత్యేక షో నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. సదస్సులో ప్రభుత్వం ముసాయిదా డ్రోన్ పాలసీని వెల్లడించటంతో పాటు అవగాహనా ఒప్పందాలు చేసుకోనుంది.ఈ జాతీయ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నిర్వాహకులు సీఎంకు డ్రోన్లతో స్వాగతం పలికారు. డ్రోన్‌ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబుతోపాటు పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ రోజు బెర్మ్ పార్క్లో డ్రోన్ షో

ఈరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు విజయవాడ కృష్ణానది ఒడ్డున బెర్మ్‌ పార్కు వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, 5 వేల డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ షోతో పాటు లేజర్‌ షో తదితర కార్యక్రమాలు ఉంటాయి. ఈ సదస్సుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది వక్తలు, ప్రతినిధులు పాల్గొంటారు. వెయ్యి మంది వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, నిపుణులు వస్తారు. డ్రోన్ల తయారీ, వ్యవసాయ లాజిస్టిక్స్‌, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, ఆరోగ్యం తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగంపై 9 చర్చా సెషన్లు ఉంటాయి. డ్రోన్ల సాంకేతికత వినియోగంపై కీలకమైన నాలుగు ప్రజెంటేషన్లు, ప్రత్యేక ఇంటరాక్టివ్‌ సెషన్‌ ఉంటాయి. వేదిక వద్ద దేశవ్యాప్తంగా డ్రోన్‌ తయారీదారుల ఉత్పత్తులకు సంబంధించిన 40 ప్రదర్శనశాలలు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement