Sunday, January 19, 2025

AP | మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో కేసుల ప‌రిష్కారంలో మ‌రింత పురోగ‌తి

విశాఖ‌ప‌ట్ట‌ణం, ఆంధ్ర ప్రభ బ్యూరో : మ‌ధ్య‌వ‌ర్తిత్యం, ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగించ‌టం ద్వారా కేసులకు స‌త్వ‌ర ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని, పురోగ‌తి క‌లుగుతుంద‌ని సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ పి.ఎస్. న‌ర‌సింహ పేర్కొన్నారు. ఐసీటీ, ఏఐ వంటి సాంకేతిక స‌హాయంతో వేగ‌తంత‌మైన తీర్పులు ఇవ్వొచ్చ‌ని అభిప్రాయ‌పడ్డారు.

మ‌ధ్య‌వ‌ర్తిత్వం, ఆర్బిట్రేష‌న్ విధానాల్లో మ‌రిన్ని పార‌ద‌ర్శ‌క ప‌ద్ధ‌తులు అవ‌లంబించాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. నేష‌న‌ల్ జ్యుడీషియ‌ల్ అకాడెమీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ జ్యుడీషియ‌ల్ అకాడెమీ సంయుక్త ఆధ్వ‌ర్యంలో విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా రెండు రోజుల పాటు (18, 19వ తేదీల్లో) జరగబోయే సౌత్ జోన్ -2 ప్రాంతీయ స‌ద‌స్సులో భాగంగా తొలి రోజు కార్య‌క్ర‌మాన్ని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ అనిరుద్ధ బోస్, ఝార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్ర రావు, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి. నరేందర్ ల‌తో క‌లిసి శనివారం జస్టిస్ పి.ఎస్. నరసింహ ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎంద‌రో మ‌హానుభావులు అంద‌రికీ వంద‌నాలు అంటూ త‌న ప్ర‌సంగాన్ని మొద‌లు పెట్టారు. న్యాయ‌ప‌రమైన అంశాల‌పై శిక్ష‌ణ‌, అవ‌గాహ‌న క‌ల్పించే విష‌యాల్లో లా క‌మిష‌న్, నేష‌న‌ల్ జ్యుడీషియ‌ల్ అకాడెమీలు కీల‌క పాత్ర పోషిస్తున్నాయ‌ని గుర్తు చేశారు. ఇలాంటి కాన్ఫరెన్స్ లు కోర్టుల వ్య‌వ‌హారాలు, న్యాయ‌మూర్తులు అనుస‌రిస్తున్న విధానాలు, ప‌ద్ధ‌తుల‌పై త‌ప్ప‌కుండా ప్రభావితం చూపిస్తాయ‌న్నారు.

అవసరం లేని సుదీర్ఘ వాదనలు, సంబంధం లేని ప్ర‌క్రియ‌లు, కాలయాపన చేయడానికి జరుగుతున్న వివిధ రకాల పిటీషన్లు న్యాయవ్యవస్థపై తీవ్ర ఒత్తిడి చూపిస్తున్నాయ‌న్నారు. వీటి నుంచి బయటపడి సాంకేతితో కూడిన విధానాలను పాటించాలని జస్టిస్ నరసింహ సూచించారు.

న్యాయమూర్తులు, న్యాయవాదులు ఒక్కటిగా కలిసి పని చేస్తే కక్షిదారులకు మంచి తీర్పులు వస్తాయని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ తీర్పుల ప్రభావం ఎగువ కోర్టులపై పని చేస్తుంద‌న్నారు. చిన్నచిన్న‌ కేసులు, మోటార్ ప్రమాద కేసులు, కుటుంబ న్యాయస్థానానికి సంబంధించిన వివిధ‌ కేసులు 12 ఏళ్లకు పైగా కాలయాపన జరుగుతోందని గుర్తు చేశారు.

- Advertisement -

ఐసీటీ, ఏఐ వంటి ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగం ద్వారా ప్ర‌యోజ‌నాలు ఎన్ని ఉన్నాయో… ఇబ్బందులు కూడా అధేవిధంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు కంప్యూట‌ర్ వాడ‌కం ద్వారా చేతిరాత నైపుణ్యం కోల్పోతాం, స్వ‌త‌హాగా ఆలోచించే శ‌క్తిని కూడా కోల్పోతామ‌ని గుర్తు చేశారు. ఇటీవల కాలంలో ప్రతి చిన్నవిషయానికి దిగువ కోర్టులను విస్మరించి నేరుగా హైకోర్టులో దాఖలు చేస్తున్న విషయాన్ని త‌న‌ ప్రసంగంలో ప్ర‌స్తావించారు.

చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన హ‌క్కుల‌పై ప్ర‌జ‌ల్లో విరివిగా అవ‌గాహ‌న క‌ల్పించాలి

చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన హ‌క్కుల‌పై ప్ర‌జ‌ల్లో విరివిగా అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధీర‌జ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. దీని ద్వారా ప్ర‌జ‌ల్లో న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై మ‌రింత నమ్మ‌కం పెరుగుతుంద‌ని, ఎన్నో స‌వాళ్ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని, ఎన్నో అడ్డంకుల‌ను తొల‌గిస్తుంద‌ని అన్నారు. కాగిత ర‌హిత న్యాయ‌స్థానాల సాధ‌న ఎంతో దూరంలో లేద‌ని ఒక ఉద‌హర‌ణ‌గా పేర్కొన్నారు.

దిగువ న్యాయస్థానాల్లో కేసుల‌ విచారణ బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. కేసులు విచారణలో మానవత్వం, మానవ హక్కులు, మధ్యవర్తిత్వం, ప్రత్యామ్నాయ మార్గాలు పాటించాలన్నారు. ఈ విధానాల వల్ల ఏ కక్షిదారునికీ అన్యాయం జరగద‌ని పేర్కొన్నారు. సమర్థవంతమైన తీర్పులు వస్తాయన్నారు. తీర్పుల వెలువ‌ర‌ణ‌లో ప్రమాణాలు పాటించడం ముఖ్యం అన్నారు. దిగువ కోర్టుల ప‌రిధిలో సాంకేతిక‌త విషయంలో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు.

త్వరలోనే పూర్తి కంప్యూటర్ ఫైలింగ్, కృత్రిమ మేథా సేవలు, కాగిత రహిత మార్పులు, వంటివి అమలులోకి వస్తాయన్నారు. ఐటీ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఆధునిక విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ఆయన చెప్పారు. న్యాయ వ్యవస్థకు న్యాయవాదులు, న్యాయమూర్తులు రాయబారులు వంటి వారిని భవిష్యత్తులో వచ్చే విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని హిత‌వు ప‌లికారు.

స‌గ‌టున 38 ల‌క్ష‌ల కేసులు న‌మోద‌వుతున్నాయి

సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయ‌మూర్తి, నేష‌న‌ల్ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్ట‌ర్ జస్టిస్ అనిరుద్ధ‌ బోస్ మాట్లాడుతూ రోజురోజుకూ కేసుల న‌మోదు సంఖ్య పెరుగుతూ వ‌స్తోంద‌ని, దేశవ్యాప్తంగా గ‌త ఏడాది 37 లక్షల కేసులు నమోదయ్యాయ‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో 4.5 కోట్ల కేసులు ప‌రిష్క‌రించాల్సి ఉంద‌ని గుర్తు చేశారు. గ‌త సంవత్స‌ర గ‌ణంకాల‌ను చూసిన‌ట్ల‌యితే స‌గ‌టున ఒక సంవ‌త్స‌ర కాలంలో 38 కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని తెలిపారు.

జనాభా పెరుగుదలతో పాటు కేసులు సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. ముఖ్యంగా అతి తక్కువ సమయంలో పరిష్కరించవలసిన కుటుంబ న్యాయస్థానం, మోటార్ ప్రమాదాలు, నిరాధారణ కలిగిన చెక్కులు వంటివి సత్వర పరిష్కారానికి కూడా జాప్యం ఇటువంటి వాటి విషయంలో మ‌ధ్య‌వ‌ర్తిత్వ‌ ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయడం మంచిదన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ కృష్ణయ్య తీర్పులను ఉటంకించారు. సాంకేతికతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కూడా ముఖ్యమన్నారు. న్యాయం అంద‌రికీ అందుబాటులో ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ప‌లు అంశాల‌పై సుదీర్ఘ చ‌ర్చ‌

తొలిరోజు శ‌నివారం ముందుగా న్యాయస్థానాల్లో వాజ్యాల జాబితా అన్వేషణ – మినహాయింపులు అనే అంశంపై సుదీర్ఘ చ‌ర్చ జ‌ర‌గ్గా రిసోర్స్ ప‌ర్స‌న్లుగా పి.ఎస్. న‌ర‌సింహ‌, జ‌స్టిస్ జ‌య‌శంక‌రన్ నంబియార్ ప‌లు అంశాలపై వారి అనుభ‌వాల‌ను, అభిప్రాయాల‌ను పంచుకున్నారు. ఇత‌ర సీనియ‌ర్, జూనియ‌ర్ న్యాయ‌మూర్తులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బ‌దులిచ్చారు. అలాగే కేసుల ప‌రిష్కారంలో ప్ర‌త్యామ్నాయ ప‌ద్ధతుల అనుస‌ర‌ణ అనే అంశంపై ద్వితీయ చ‌ర్చ జ‌ర‌గ్గా… జ‌స్టిస్ శామ్ కోషి, జ‌స్టిస్ అనిత సుమంత్ రిసోర్స్ ప‌ర్స‌న్లుగా వ్య‌వ‌హ‌రించారు.

మ‌ధ్య‌వ‌ర్తిత్వ విధానంలో అనుస‌రించాల్సిన ప్ర‌త్యామ్నాయ ప‌ద్ద‌తులు, ఆన్లైన విధానాల‌పై విస్తృతంగా చ‌ర్చించారు. అనంత‌రం డిజిటిల్ డివైడ్ – రోల్ ఈ.స‌ర్వీసెస్ అనే అంశంపై జస్టిస్ అను శివ‌రామ‌న్, జ‌స్టిస్ సీఎం జోషిల ఆధ్వర్యంలో చ‌ర్చ సాగింది. ప‌లు అంశాల‌పై వివ‌ర‌ణ ఇస్తూ ఇత‌ర‌ న్యాయ‌మూర్తుల సందేహాల‌ను నివృత్తి చేశారు.

కార్య‌క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల హైకోర్టు న్యాయ‌మూర్తులు, జిల్లా కోర్టుల న్యాయ‌మూర్తులు, విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, న్యాయ సేవాధికార సంస్థ కార్య‌ద‌ర్శి ఎం.వి. శేష‌మ్మ‌, విశాఖ కోర్టు ప‌రిధిలోని ఇత‌ర న్యాయ‌మూర్తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement