అమ్మకానికి రూ. 2వేల కోట్ల బాండ్లు
ఏపీ సర్కారు ప్రయత్నం
25వ తేదీన బిడ్స్‌కు తుది గడువు
ఇదే బాటలో తొమ్మిది రాష్ట్రాలు
చేతిలో డబ్బుల్లేకనే ఈ పని
ఆంధ్రప్రభ స్మార్ట్, ఢిల్లీ ప్రతినిధి: ఏపీలోని ఎన్డీయే సర్కారు ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి సారించింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన భారీ హామీల అమలుకు ఖజానాను స్థిరీకరించే ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకు నిధులను కూడగట్టే క్రతువును షురూ చేసింది. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పులిచ్చే కాబోలీ వాలాల జాడ లేదు. ఇప్పటికే నవరత్నాల కోసం పెరిగిన అప్పుల వడ్డీలు .. సీరియస్గాచూస్తుంటే, ఇక కొత్త ప్రభుత్వానికి దిక్కు తోచని స్థితి. అంతే .. ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. వీటి విలువ రూ. 2,000 కోట్లు. ఈ నెల 25వ తేదీన ఈ సెక్యూరిటీ బాండ్లు వేలానికి రానున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఇ-కుబేర్) ద్వారా వేలం వేస్తారు. కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో ఆర్డీఐ వీటిని విక్రయిస్తుంది. రూ. 1,000 కోట్ల విలువ చేసే రెండు సెక్యూరిటీ బాండ్లను చంద్రబాబు వేలానికి పెట్టారు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ధృవీకరించింది. ఈ బాండ్ల కాల వ్యవధి ఒకటి- 11 సంవత్సరాలు, ఇంకొకటి- 20 సంవత్సరాలు. వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు.కాంపిటీటివ్ విధానంలో బాండ్లను కొనదలిచిన వారు ఈ నెల 25వ తేదీన ఉదయం 10:30 నుంచి 11:30 గంటలు, కాంపిటీటివ్ విధానంలో బాండ్లను కొనదలిచిన వారు ఈ నెల 25వ తేదీన ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తమ బిడ్స్‌ను దాఖలు చేయవచ్చు.
ఇదే దారిలో .. 9 రాష్ట్రాలు
ఏపీ సహా తొమ్మిది రాష్ట్రాలు తమ సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టాయి. ఇందులో- హర్యానా- రూ.1,500 కోట్లు, జమ్మూ కాశ్మీర్- రూ.500 కోట్లు, కేరళ- రూ.1,500 కోట్లు, మిజోరం- రూ.71 కోట్లు, రాజస్థాన్- రూ.4,000 కోట్లు, తమిళనాడు- రూ.3,000 కోట్లు, పశ్చిమ బెంగాల్- రూ. 3,500 కోట్ల రూపాయల మేర విలువ చేసే సెక్యూరిటీ బాండ్లు ఉన్నాయి. తెలంగాణ సైతం ఆదాయ వనరులను సమీకరించుకోవడానికి సెక్యూరిటీ బాండ్ల వేలంపైనే ఆధారపడింది. 1,000 కోట్ల రూపాయల విలువ చేసే బాండ్లను వేలానికి పెట్టింది. మొత్తంగా ఆయా ప్రభుత్వాల నుంచి 17,071 కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ వేలం వేయనుంది. అవన్నీ కూడా ఈ నెల 25వ తేదీన వేలానికి రానున్నాయి.