ఏపీ ప్రభుత్వం పంద్రాగస్టుకు ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. ఇప్పటికే ఏయే జిల్లా కేంద్రాల్లో ఎవరు జెండా ఆవిష్కరణ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలకు నిధులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆగస్ట్ 15వ తేదీ చేయాల్సిన పనులపై కీలక సూచనలు చేశారు.
పంద్రాగస్టు వేడుకల నిర్వహణ కోసం మైనర్ గ్రామ పంచాయతీలకు నిధులను రూ.100 నుంచి రూ.10 వేలు.. మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25000లకు పెంచినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. రిపబ్లిక్ వేడుకలకు కూడా ఇదే తరహాలో నిర్వహణ కోసం నిధులు కేటాయిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆగస్ట్ 15న పాఠశాలల్లో వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించాలని పవన్ ఆదేశించారు. అలాగే క్రీడాపోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేయాలని స్పష్టం చేశారు.