Tuesday, November 26, 2024

నిధులు మాయం.. సర్పంచ్ ల అయోమయం..

కర్నూలు, ప్రభన్యూస్ : కోడుమూరు పంచాయతీ పరిధిలో ఇటీవల 15వ ఆర్థిక సంఘంకు సంబంధించి రెండు విడతలుగా రూ.1.59 కోట్లు జమయ్యాయి. ఈ నిధులతో డ్రైనేజీ సమస్య పరిష్కారంకు పలు చోట డ్రైనేజీల నిర్మాణం పూర్తిచేసి బిల్లులు పెట్టుకొవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆలోగా పంచాయతీ ఖాతాలు తెరిచి చూస్తే జీరో బ్యాలెన్స్‌ చూపింది. దీంతో ఖంగుతినడం సర్పంచ్‌ వంతైంది. ప్రస్తుతం పనులు చేసిన వారికి బిల్లలు ఎలా చెల్లించాలి. ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేకపోతే పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీరు నిర్వహణ ఎలా పరిష్కరించాలని అక్కడి సర్పంచ్‌ ఆవేదన.

గోస్పాడు మండలం కృష్ణపురం గ్రామం అతి చిన్న గ్రామం. ఈ పంచాయతీకి 15వ ఆర్థిక సంఘం కింద రూ.3 లక్షలు జమయ్యాయి. దీంతో సర్పంచ్‌ గ్రామంలో పారిశుద్ధ్య పనులతో పాటు, వీధిలైట్లు, డ్రైనేజీ సమస్య పరిష్కార పనులు చేపట్టాలని తలిచారు. ఈలోగా పంచాయతీ ఖాతాను చూస్తే నిధులు ఖాళీ అయ్యాయి. దీంతో అక్కడి సర్పంచ్‌కు ఆవేదన తప్పలేదు. ఆలూరు పంచాయతీలో తిష్టవేసిన సమస్యల పరిష్కారంకు అక్కడి సర్పంచ్‌ నడుం బిగించారు. వీటిలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, డ్రైనేజీ, వీధి దీపాలు ఇలా అన్ని సమస్యల పరిష్కర నిమిత్తం 15 వ ఆర్థిక సంఘం నిధుల కింద జమయైన రూ.30 లక్షలతో పనులు చేపట్టాలని తలిచారు. కాని ఖాతా తెరిచి చూస్తే ఖాళీగా ఉంది. దీంతో పనులు ఎలా చేపట్టాలనే ఆలోచనలో పడ్డారు. డోన్‌ పరిధిలోని ఎర్రగుంట్ల పంచాయతీ సర్పంచ్‌ గ్రామంలో డ్రైనేజీ, శానిటేషన్‌ పనులు చేపట్టారు. చేపట్టిన పనులకు ఇటీవల మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.30 లక్షల్లో కొంత సొమ్ము వాటికి చెల్లించాలని తలిచాడు. కాని ఇటీవల పంచాయతీ ఖాతా తెరిచి చూస్తే జీరో బ్యాలెన్స్‌ చూపింది.

ఇలా ఒక్క కోడుమూరు, డోన్‌, ఆలూరు పరిధిలోని పంచాయతీలలోనే కాదు జిల్లాలోని 973 పంచాయతీలు ఉండగా, వాటి పరిధిలో దాదాపు రూ.150 కోట్లు ఖాళీ అయ్యాయి. దీంతో ఇటీవల సర్పంచ్‌లుగా బాధ్యతలు చేపట్టి అభివృద్ధి పనులు చేపట్టాలని తలిచిన సర్పంచ్‌లందరికీ ఈ విషయం ప్రస్తుతం మింగుడు పడటం లేదు. కర్నూలు జిల్లాలో 973 పంచాయతీలున్నాయి. వీటి అభివృద్ధి నిమిత్తం ఇటీవల 15వ ఆర్థిక సంఘం కింద రెండు విడతలుగా నిధులు జమయ్యాయి. ఇందులో మొదటి విడతగా 2020 -21కు రూ.150 కోట్ల జమకాగా, ఇక రెండవ విడత కింద 2021-22కు రూ. 56 కోట్లు జమకావడం గమనార్హం. వీటిలో జిల్లాలో 28 మేజర్‌ గ్రామ పంచాయతీలు ఉండగా, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నుంచి రూ. కోటీ వరకు జమకాగా, మైనర్‌ పంచాయతీలకు రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఖాతాలో జమయ్యాయి.

ఇటీవల కురిసిన వర్షాల మూలంగా చాల పంచాయతీలలో డ్రైనేజీలు దెబ్బతినగా, ఇంకొన్నిచోట్ల వీధి దీపాలు, ఇతర సమస్యలున్నాయి. వీటిని పరిష్కరించే దిశగా సర్పంచ్‌లు పనులు చేసేందుకు సిద్ధమవుతే ఖాతాలలో జీరో నిధులను చూపించడంతో ఖంగుతింటున్నారు. కొందరైతే నిధులున్నాయనే ధైర్యంతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం బిల్లు వస్తాయా లేదా అన్నభయం వారిని పట్టుకుంది. గతంలో కూడా 14వ ఆర్థిక సంఘంకు సంబందించిన నిధులను విద్యుత్‌ బకాయిల పేరిట ఖాతాల నుంచి ప్రభుత్వ అధికారులు ఖాళీ చేశారు. తిరిగి 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా ఖాళీ చేయడంతో సొమ్ము లేకుండా పనులు ఎలా చేయాలని సర్పంచ్‌లు, కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు.

దేశానికే పట్టుకొమ్మలే గ్రామాలని తలిచిన కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా కేంద్ర ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీ ఖాతాలలో జమ చెస్తోంది. ఈ నిధులను గ్రామాభివృద్ధి పనులకు సర్పంచ్‌లు వినియోగించుకోవాల్సి ఉంది. ఇందులో 50 శాతం తాగునీటి, పారిశుద్ధ్య పనులకు వినియోగించుకోవాల్సి ఉండగా, ఇక మిగిలిన 50 శాతం వీధి దీపాలు, ఇతర అభివృద్ధి పనులు వినియోగించాలి. ఈ క్రమంలో కేంద్రం 15 ఆర్థిక సంఘం కింద జిల్లాకు రెండు విడతలో రూ. 206 కోట్లు జమ చేయగా, ఇందులో దాదాపు రూ.150 కోట్లను ప్రభుత్వ అధికారులు దారి మళ్లించడం గమనార్హం. వాస్తవంగా గ్రామ సంక్షేమంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది. వీటిద్వారా రామన్న రాజ్యం తీసుకరానున్నట్లు ప్రకటించింది. ఇప్పుడేమో గ్రామ సంక్షేమ కార్యక్రమాలకు ఒక్క రూపాయి విదిల్చని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్ధిక సంఘం నిధులను దారి మళ్లించడం ఎంత వరకు సబబు అని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

పంచాయతీల నుంచి నిధులు మళ్లిన విషయంపై జిల్లా అధికారులను ప్రశ్నిస్తే ఇప్పుడే మా దృష్టికి వచ్చిందని నిధులను ఏ అవసరాలకు కోసం వెనక్కి తీసుకుంది తెలియదంటున్నారు. సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్న మాట నిజమే. ఈ విషయంను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం అంటున్నారు జిల్లా పంచాయతీశాఖ ఉన్నత స్థాయి అధికారి ప్రభాకర్‌రావు.

ఇది వరకు ఓసారి నిధులు ఎవరికీ సమాచారం లేకుండా తీసుకున్నారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంలోనూ అలానే చేశారు. సర్పంచ్‌కే పూర్తి అధికారాలన్నారు. ఇప్పుడు ఆ సర్పించ్‌కే తెలియకుండా రూ. లక్షల నిధులు వెనక్కి మళ్లిస్తున్నారు. ఇది సర్పంచ్‌ హక్కులను కాలరాయడమేనని పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టం ప్రతాప్‌రెడ్డి పేర్కొంటున్నారు. తక్షణమే ప్రభుత్వం తీసుకున్న 15వ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే వెనక్కు ఇవ్వాలి. ఈ విషయంపై ఈ రోజు కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట జిల్లాలోని అన్ని పంచాయతీల సర్పంచ్‌లతో కలిసి రాజకీయ పార్టీలకు అతీతంగా కలెక్టరేట్‌ ముట్టడీ, నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement