Thursday, November 21, 2024

వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి నిధులివ్వండి : వినోద్ కుమార్

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణాకు నిధులివ్వాలని నీతి ఆయోగ్‌కు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఢిల్లీలోని తెలంగాణా భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్‌తో భేటీ అయ్యారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని, నాటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి లేఖలు రాసిన విషయాన్ని వినోద్ కుమార్ ప్రస్తావించారు. తెలంగాణలో అమలవుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాల గురించి వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాల గురించి ఆయనతో చర్చించారు. అనంతరం వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయాలని అభ్యర్థించినట్టు చెప్పారు.

ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలంగాణకు 24 వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపింది. నాటి నుంచి నేటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రులు లిఖితపూర్వకంగా లేఖలు రాయడంతో పాటు కలిసినప్పుడల్లా అడుగుతున్నారని రాజీవ్ కుమార్‌కు వివరించామన్నారు. విభజన సమయంలో 9 పాత జిల్లాలను నీతి ఆయోగ్ వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి, ఆ ప్రాంతాలకు నిధులివ్వాలని సూచనప్రాయంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం ఒక్కో జిల్లాకు 50 కోట్ల చొప్పున రూ. 450 కోట్లు నాలుగేళ్ళ పాటు ఇచ్చారని, 2019-20 నుంచి ఈ నిధులని నిలిపివేసిన విషయాన్ని నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లామని వినోద్ వెల్లడించారు. రూ. 900 కోట్ల నిధులపై నీతి ఆయోగ్ నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపి చాలా రోజులవుతోందని, ఆ అంశం గురించే రాజీవ్ కుమార్‌ను కలిశామని తెలిపారు. అందుకు సంబంధించిన లేఖలనూ ఆయనకు సమర్పించామన్నారు. వారం, పది రోజుల్లో దీనిపై చర్యలు తీసుకుంటామని రాజీవ్ కుమార్ హామీ ఇచ్చారని వినోద్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement