Saturday, November 23, 2024

మామిడి ‘ధర’హాసం.. లాభాల రుచి చూపిస్తున్న ఫలరాజు

అమరావతి, ఆంధ్రప్రభ: మధురఫలం మామిడి ‘ధర’హాసం చేస్తోంది. నాణ్యత, దిగుబడితో పాటు- మార్కెట్‌ కూడా ఆశా జనకంగా ఉండటంతో రైతుల్లో సంతోషం తొణికిలాడుతోంది. గడిచిన రెండేళ్ళుగా మామిడి మార్కెట్‌ను కరోనా కబళించటంతో ఎగుమతులు అంతంతమాత్రమై లాభాలు అడుగంటి పోయాయి. ఈ ఏడాది మాత్రం వేసవి తొలిసీజన్‌ పంట రైతులకు తియ్యటి లాభాలను రుచి చూపిస్తోంది. దేశీయంగా వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తోటల వద్దకు అక్కడికక్కడే కొనుగోలు చేసి మామిడి పళ్ళను తమ ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలిస్తున్నారు. ఢిల్లీ, ముంబాయి, నాగపూర్‌, కర్ణాటక, తమిళనాడు నుంచి హోల్‌ సేల్‌ ట్రేడర్లు అధికంగా ఏపీకి వచ్చి మామిడిని తోటల వద్దనే కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌ బాగా ఉండటంతో రైతులకు ప్రస్తుతం రవాణా భారం కూడా లేకుండా పోయింది.

మరో వైపు విదేశాలకు సైతం మామిడి పళ్ళను తరలించేందుకు ఉద్యానశాఖ ద్వారా ఎక్స్‌పోర్టు కన్సల్టెన్సీలతో ఒప్పందాలు చేసుకుంటుంది. గత ఏడాది అత్యంత నాణ్యమైన ఏ గ్రేడ్‌ బంగినపల్లి మామిడి టన్ను గరిష్ట ధర సుమారు 1 లక్ష రూపాయలు. ఈ ఏడాది తొలి సీజన్‌ పంట ధర కనిష్టంగా రూ 95 వేలు, గరిష్టంగా రూ 1.35 లక్షలు పలుకుతోంది. ఇపుడున్న మార్కెట్‌ పరిస్థితులు ఇలాగే కొనసాగి డిమాండ్‌ మరింత పెరిగితే గరిష్ట ధర 1.6 లక్షలకు చేరవచ్చని మార్కెట్‌ అంచనా. సగటు ధర రూ 1.15 నుంచి రూ 1.2 లక్షల వద్ద స్థిరపడితే మామిడి రైతుల కష్టాల లాభాల ఫలితాలు వస్తాయని అంచనా. ఎప్పటిలాగే కృష్ణా జిల్లాలోని నూజివీడు, రెడ్డిగూడెం, విస్సన్నపేట, మైలవరం ప్రాంతాల్లోని మామిడికి మార్కెట్లో తొలి బోణీ అవుతోంది.

మామిడికి గడిచిన రెండేళ్లుగా నష్టాలు ఎదుర్కొని ఎంత రేటుకయినా మామిడిని తెగనమ్ముకున్న రైతులు ఈ సీజన్‌ లో ఆచితూచి అడుగేస్తూ గరిష్టధరలకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగినపల్లితో పాటు సువర్ణరేఖ, తోతాపురి, చిన్న రసాలకు డిమాండ్‌ బాగా ఉంది. దేశవ్యాప్తంగా బంగిన పల్లికి మంచి బ్రాండ్‌ ఇమేజ్‌ ఉండగా ఉత్తరాది రాష్ట్రాల్ల్రో సువర్ణరేఖ, తోతాపురి పండ్లకు కూడా మంచి మార్కెట్‌ ఉంది. ఒక హెక్టారుకు 8 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుండగా.. సుమారు 3.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణం సాగయిన మామిడి దిగుమతులు ఈ ఏడాది సుమారు 50 లక్షల టన్నులకు చేరవచ్చని అంచనా.
వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ (ఎపెడా) సౌజన్యంతో మామిడిపండ్లను ఈ ఏడాది భారీగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు రాష్ట్ర ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తోంది.

ఈ మేరకు మామిడి సాగు ప్రాంతాలకు సమీప నగరాలుగా ఉన్న విజయవాడ, తిరుపతిలో త్వరలో బయ్యర్స్ సెల్లర్స్‌ మీట్‌లు నిర్వహించనున్నారు. ఈ మీట్‌లో దేశీయ హోల్‌ సేల్‌ ట్రేడర్లతో పాటు ఇంటర్నేషనల్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులు, విదేశీ ట్రేడింగ్‌ కంపెనీ ప్రతినిధులు, ఉన్నతాధికారులతో పాటు ఎంపిక చేసిన మామిడి రైతులు కూడా పాల్గొననున్నారు. ఇదే మీట్‌లో రైతులు వ్యాపారుల మధ్య ఎగుమతి ఒప్పందాలు కుదిర్చేందుకు ఎపెడా ఇప్పటికే సంప్రదింపులు చేస్తోంది. ఇప్పటివరకు గల్ప్‌ దేశాలకు ఎగుమతి చేసేందుకు సూత్రప్రాయ ఒప్పందాలు కుదిరాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్యాకింగ్‌, మామిడి నిల్వ ఉండేందుకు అవసరమైన విధానాలను అనుసరించేందుకు గుర్తింపు పొందిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను కూడా ఎగుమతి వ్యాపారంలో భాగస్వాములను చేయనున్నారు. విదేశాలకు తమ పంటను ఎగుమతి చేసేందుకు ఇప్పటివరకు సుమారు 20 వేల మంది రైతులు రిజిస్ట్రేష్రన్‌ చేసుకున్నట్టు సమాచారం. ఉద్యానశాఖ సహకారంతో అవలంబించిన ఫ్రూట్‌ కేర్‌ విధానాలు, తోటబడుల ద్వారా రైతులకు అందిం చిన శిక్షణ ద్వారా ఈ ఏడాది అత్యంత నాణ్యమైన మామిడి దిగుబడి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement