టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎంపీలతో చంద్రబాబు మాట్లాడుతూ.. . ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో విహరించొద్దని గెలిచిన ఎంపీలకు స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు.
ఇకపై మీరంతా మారిన చంద్రబాబును చూస్తారని అన్నారు. చంద్రబాబు మారరు.. ఎవరి మాట వినరు అనే మాట ఇక వినిపించబోదని అన్నారు. ఇకపై తనను ఎంపీలు తరచూ కలుస్తూ ఉండాలని కోరారు. ఎంత బిజీగా ఉన్నా పక్కకు వచ్చి మరీ ఎంపీలతో మాట్లాడతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఉండబోదని.. పూర్తి రాజకీయ పాలన తెస్తామని అన్నారు.
‘‘ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండదు. చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది. ఇకపై అలా ఉండదు.. మీరే ప్రత్యక్షంగా చూస్తారు. ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి. నేను బిజీగా ఉన్నా కూడా మీతో మాట్లాడతాను. నాకోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు. కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు – అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదు. ఇకపై ప్రతి అంశాన్ని నేను వింటాను.. నేనే చూస్తాను. ఇకపై రాజకీయ పరిపాలన ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి పనిచేయాలి. ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తల కష్టం, త్యాగం, కృషి వల్లే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈనెల 12 ప్రమాణ స్వీకారం చేస్తా. ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలి’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు పార్లమెంటరీ సమావేశంలో కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన నేతలకు సూచించారు.