తిరుమల, ప్రభ న్యూస్ : ఎక్కువ మంది సామాన్య భక్తలకు వైకుంఠద్వారా దర్శనం కల్పించేందుకు వీలుగా జనవరి 2 నుంచి 11వరకు అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు చేసినట్లు, ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి దర్శనం ఏర్పాట్లపై శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వివిధ శాఖల అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2023 జనవరి 2 వైకుంఠ ఏకాదశి , జనవరి 3న వైకుంఠ ద్వాదశి. గత రెండేళ్లుగా అనుసరిసున్న విధంగానే జనవరి 11వరకు పదిరోజుల పాటు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది.
జనవరి 2న తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాల అనంతరం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. రోజుకు దాదాపు 80 వేల మందికి దర్శనం కల్పించనున్నారు. ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాల రద్దు చేసింది. శ్రీవాణి, ఎస్‌ఈడి టికెట్లు, ఎస్‌ఎస్‌డి టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు మహాలఘు దర్శనం కల్పిస్తారు.
దర్శన టికెట్లు
రోజుకు 25వేలు చొప్పున 10 రోజులకు కలిపి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. తిరుమల స్థానికుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన 1 కౌంటరుతోపాటు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాలలో రోజుకు 50 వేలు చొప్పున మొత్తం ఐదు లక్షల ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ చేస్తారు. ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపి ఈ టోకెన్లు పొందాల్సి ఉంటుంది. ఎస్‌ఎస్‌డి టోకెన్లు జా రీ చేసే తొమ్మిది ప్రదేశాలను రెండు క్లస్టర్‌లుగా విభజించి జేఈవోలు పర్యవేక్షిస్తారు. రోజుకు 2000 చొప్పున శ్రీవాణి టెకెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
ప్రతి రోజూ 2వేల మంది దాతలు తమ దర్శన కోటాను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ఐపీలకు మాత్రమే దర్శన టికెట్లు కేటాయిస్తారు. సిఫార్సు లేఖరు తీసుకోబడవు.. నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాద శి, ద్వాదశి దృష్ట్య డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు వసతి అడ్వాన్సు బుకింగ్ రద్దు చేస్తారు. గదుల కేటాయింపులో పారదర్శకత పెంచేందుకు మరిన్ని కౌంటర్లు పెంచి సీఆర్‌వోలో మాత్రమే కేటాయిస్తారు.
ప్రత్యక్ష ప్రసారాలు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 2న తిరుమలలోని నాద నీరాజనం వేదికపై అఖండ విష్ణుసహస్త్రనామ పారాయణం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలనుంచి 11 గంటల మధ్య స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుంది. జనవరి 3వ తేదిన వైకుంఠ ద్వాదశిరోజున స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటిలో శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ స్నపనం అనంతరం చక్రస్నానం చేస్తారు. అన్ని కార్యక్రమాలను ఎస్‌బీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అదేవిధంగా సందర్భానుసారంగా పుష్పాలంకరణలు చేయనున్నారు. శ్రీవారి సేకువలు, ఎస్‌సీసీ క్యాడెట్‌లతో భక్తులకు సేవలందించనున్నారు. ఈకార్యక్రమంలో జేఈవోలు శ్రీమతి సదా భార్గవి,వీరబ్రహ్మం, సివిఎస్‌ఓ నరసింహ కిశోర్, ఎస్ బిసి సిఇఓ షణ్ముక్ కుమార్, సిఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ2 జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.