Monday, November 18, 2024

ఆగస్టు1 నుంచి గరీబ్‌ యోజన ఉచిత బియ్యం.. రేషన్‌ షాపుల వ్యవస్థ కొనసాగింపు

అమరావతి, ఆంధ్రప్రభ: గత మూడు నెలలుగా నిలిచిపోయిన కేంద్ర ప్రభుత్వ ప్రధామంత్రి గరీబ్‌ కల్యాణ అన్నయోజన పథకం ఉచిత బియ్యం ఆగస్టు1 నుంచి రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేసేందుకు సోమవారం మంత్రివర్గ ఉప సంఘం చేసిన సిఫార్సులకు సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. దీంతో గత మూడు నెలలుగా నిలిచిపోయిన ఈ పథకాన్ని తిరిగి పునరుద్ధరించినట్లయింది. అయితే రాష్ట్రంలోని 1.46 కోట్ల కార్డుదారులకు కాకుండా 89 లక్షల కార్డుదారులకే కేంద్ర ఉచిత బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఆగస్టు నెలకు సంభధించిన బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తుండగా గత మే, జూన్‌, జూలై నెలల్లో పంపిణీ చేయని బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయలేదు. కేంద్ర ప్రభుత్వ ఉచిత బియ్యం పంపిణీపై మంత్రి వర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. ఆగస్టు 1 నుండి పీఎంజీకేవై పథకం క్రింద ఉచిత బియ్యాన్ని రాష్ట్రంలోని 2.68 కోట్ల మంది నిరుపేదలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కోవిడ్‌ నేపధ్యంలో జాతీయ ఆహార భద్రతా పథకం అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేవై ప్రవేశపెట్టిందన్నారు.

ఈ పథకం ఏప్రిల్‌ 2020 నుండి మార్చి 2022 వరకూ రాష్ట్రంలో కొనసాగించడం జరిగిందన్నారు. అయితే కోవిడ్‌ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన నేపధ్యంలో కేంద్రం అందజేసే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలోని నిరుపేదలకు లబ్దిచేకూర్చాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించిందన్నారు. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సు మేరకు విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిన ఏడు జిల్లాలు రాయలసీమలోని 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలోని 1.67 కోట్ల మందితో పాటు మిగిలిన పూర్వపు 6 జిల్లాలలోని 89.20 లక్షల ఎస్‌.సి., ఎస్‌.టి.లకు మరియు 24.60 లక్షల ఏఏవై కార్డుదారులకు ఈ పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అయితే తిరుపతి, విశాఖపట్నం కార్పొరేషన్లను ఈ పథకం నుంచి మినహాయించినట్లు తెలిపారు. అయితే నూతనంగా ఏర్పడిన ప్రకాశం జిల్లాలోని నిరుపేదలకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తం 2.68 కోట్ల మందికి ఈ ఉచిత బియ్యాన్ని మద్యాహ్నం 3.30 గంటల నుండి సాయంత్రం వరకూ రేషన్‌ డిపోల వద్దే పంపిణీచేయడం జరుగుతుందన్నారు. సంబందిత కూపన్లను ముందుగానే లబ్దిదారులు అందరికీ వాలంటీర్ల ద్వారా పంపిణీచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఇదిలావుండగా రాష్ట్రంలో ప్రస్తుతం 4.23 కోట్ల మంది లబ్దిదారులకు పి.డి.ఎస్‌.ద్వారా ఒక రూపాయికే కిలో బియ్యం పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని మంత్రులు వెల్లడించారు. ఈ పథకం యధావిధిగా కొనసాగుతుందని, లబ్దిదారుల ఇళ్ల వద్దకే వాహనాల ద్వారా బియ్యం పంపిణీచేయడం జరుగుతుందన్నారు. పి.డి.ఎస్‌.ద్వారా లబ్దిపొందే 4.23 కోట్ల మందిలో పిఎంజికెఎవై లబ్దిదారులు 2.68 కోట్ల మంది కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అర్హులు అందరికీ పిఎంజికెఎవై పథకాన్ని వర్తింపచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన మంత్రికి లేఖ వ్రాశారన్నారు. నీతిఆయోగ్‌ సిఫార్సుల మేరకు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులు చేసిన పలు ప్రయత్నాల మేరకు మరియు మంత్రి వర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రంలో పిఎంజికెఎవై పథకం అమలుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదు ఏళ్లలో 12 వేల కోట్లు ఈ శాఖ ద్వారా వెచ్చిస్తే కేవలం మూడేళ్లలో తమ ప్రభుత్వం 16 వేల కోట్ల మేర వెచ్చించినట్లు మంత్రి తెలిపారు. నూతనంగా 7,051 కార్డులను జారీచేయడం జరిగిందని మంత్రి తెలిపారు. కరోనా సమయంలో రాష్ట్రంలో కోటి 46 లక్షల రేషన్‌ కార్డులుంటే కేంద్రం 89 లక్షల కార్డులకు మాత్రమే బియ్యం ఇచ్చిందని తెలిపారు. కేంద్రం ఇచ్చే 89 లక్షల కార్డులకి బియ్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

ప్రతి నెలా ఇచ్చే రేషన్‌కి అదనంగా కేంద్రం ఇచ్చే కార్డుల బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్‌ షాపులను మూసేస్తామని వస్తున్న వాదనలు అ్యస్తమన్నారు. కొందరు ప్రజల్లో అపహలు సృష్టిస్తున్నాయని, రాష్ట్రంలో ఒక్క రేషన్‌ కార్డు తొలగించలేదన్నారు. కొత్తగా 7 లక్షల కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు. సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎం.డి. వీరపాండ్యన్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement