21 రోజులు సాగనున్న బస్సు యాత్ర
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ
ఉదయం జనంతో ముఖాముఖి
మధ్యాహ్నం వేళ బహిరంగ సభ
55 రోజుల ప్రచార ప్రణాళిక రెడీ
ప్రతి లోక్‌సభ స్థానంలో ఒక సభ ఏర్పాటు
అయిదేండ్ల పాలనలో సంక్షేమంపై వివరణ
అభివృద్ధికి పునాదులకు ప్రజలతో చర్చ
కోఆర్డినేషన్ సభ్యులతో భేటీ అనంతరం కార్యాచరణ వెల్లడి
(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి)
ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార శంఖారావంలో మరో అంకం ప్రారంభం కానుంది. సిద్ధం పేరిట జన సునామీ సృష్టించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇక మేమంతా సిద్ధం పేరిట 21 రోజులు బస్సు యాత్ర నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశరు. ఎన్నికల పోలింగ్ తేదీ ఆలస్యమవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా..
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఈ నెల 27 నుంచి 20 రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఈ యాత్ర దాదాపు అన్ని నియోజకవర్గాల మీదుగా సాగుతుందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్రలో ఈ ఐదేళ్లలో తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ప్రతీరోజూ ఒక బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. ఉదయం జనంతో ముఖాముఖి మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు.
రీజనల్ కో ఆర్డినేటర్లతో జగన్ భేటీ
ఎన్నికల కార్యచరణను రూపొందించడానికి సోమవారం వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో భేటీ కానున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల కూటమి బండారాల్ని ప్రజల ముందు ఉంచేలా కార్యచరణకు రూపకల్పన చేస్తున్నారు, జిల్లాల వారీగా పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, పోలింగ్‌కు మరో 55 రోజులు ఉండడంతో వచ్చే రోజుల్లో వీలైనంతవరకు ప్రజల మధ్యనే ఉండేందుకు సీఎం జగన్ సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం.