తిరుమల ప్రభన్యూస్ ప్రతినిధి: స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారిని గురువారం నుంచి ప్రారంభించనుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ ద్వార దర్శనానికి ముందుగానే టోకెన్లను జారీచేసిన టిటిడి టోకెన్ల కోటా పూర్తవ్వడంతో 8 వ తేది నుంచి టోకెన్ల జారిని తాత్కాలికంగా రద్దుచేయగా తిరిగి నేటి నుంచి టోకెన్ల జారి ప్రక్రియను ప్రారంభించనున్నది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఏరోజు దర్శన టోకెన్లను ఆరోజు టిటిడి భక్తులకు జారీచేయనుంది. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పలు దర్శనాలు అందుబాటులో ఉన్నప్పటికీ స్వామివారిని మాత్రం సర్వదర్శనం గుండానే అధికశాతం మంది భక్తులు దర్శించుకుంటారు. రద్దీరోజుల్లో గంటలు, రోజుల తరబడి నిరీక్షించి మరి భక్తులు ఆ స్వామివారిని దర్శించుకుంటారు. దీంతో శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులు ఆదేవదేవుడి దర్శనం కోసం వేచివుండేందుకు తిరుమలలో టిటిడి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను నిర్మించడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో షెడ్లను ఏర్పాటు చేసి ఆళ్వార్ ట్యాంక్ మీదుగా శిలాతోరణం వైపుగుండా అవుటర్ రింగ్‌రోడ్డులో క్యూలైన్‌ను ఏర్పాటు చేసింది.
గతంలో స్వామివారి దర్శనానికి భక్తులు నేరుగా తిరుమలకు తరలివచ్చి సర్వదర్శనం లేదా ప్రత్యేక ప్రవేశ దర్శనం, విఐపి బ్రేక్, శ్రీవాణి ట్రస్టు, అర్జిత సేవల్లో పాల్గొని స్వామివారి దర్శించుకుంటుండగా కోవిడ్ పుణ్యమా అంటూ శ్రీవారి దర్శన విధానంలో పూర్తిగా మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పట్లో ఉన్న కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించాల్సి ఉండడంతో అప్పటి వరకు ఉన్న దర్శన విధానాలకు భిన్నంగా పూర్తిగా స్లాటెడ్ విధానంలో భక్తులను దర్శనానికి అనుమతించడం ప్రారంభించింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, అర్జిత సేవా టికెట్లను ముందుగానే ఆన్‌లైన్‌లో రిలీజ్‌చేసి భక్తులకు టికెట్లు కేటాయిస్తున్న టిటిడి సర్వదర్శనం టోకెన్లను మాత్రం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం సముదాయం, గోవిందరాజసత్రాలు, స్లాటెడ్ విధానంలో భక్తులు టోకెన్ పొందిన తరువాత క్యూలైన్ లో వేచివుండే అవసరం లేకుండా టోకెన్‌లో కేటాయించిన సమయానికి క్యూ లైన్ వద్దకు చేరుకుంటే రెండు నుంచి మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనభాగ్యం లభించేలా ఏర్పాట్లు చేసింది.
కొద్దినెలలుగా ఈ విధానాలనే అమలు చేస్తున్న టిటిడి వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో టోకెన్ల జారి ప్రక్రియలో కొన్ని మార్పులు చేసింది. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుంచి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈనెల 2 వ తేది నుంచి 11 వ తేది వరకు సంబంధించిన 5 లక్షల టోకెన్లను ఈనెల 1 వ తేది నుంచే జారిచేసిన టిటిడి. 8 వ తేదికి టోకెన్ల కోటా పూర్తవ్వడంతో అప్పటి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారిని నిలిపివేసి కౌంటర్లను మూసివేసింది. బుధవారం అర్దరాత్రి శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వారాలు మూసివేయనుండడంతో గురువారం నుంచి భక్తులకు కేవలం మూలవిరాట్ దర్శనం లభించనుండడంతో గత పది రోజులుగా శ్రీవారి దర్శన విధానంలో అమలులో ఉన్న ఆంక్షలను టిటిడి తొలగించి గతంలో ఉన్న విధానంలాగా ఇప్పటికే ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్న టిటిడి. ఇక తిరుపతిలో కేటాయించే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారిని గురువారం నుంచి యదావిధంగా కేటాయిస్తుంది టిటిడి.