తిరుమల శ్రీవారిని దర్శనానికి వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు టీటీడీ శుభవార్త చెప్పింది. వీళ్లకు స్వామి వారి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. కేవలం వారి కోసమే రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్ ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది.
ప్రత్యేక ఎలక్ట్రికల్ కారు
ఆలయం బయట గేట్ వద్ద పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంటుందని టీటీడీ వివరించింది. వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని.. ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకుని బయటకు రావొచ్చని తెలిపారు. అలాగే దర్శనం చేసుకునే వృద్ధులు, దివ్యాంగులు రూ.20 చెల్లించి రెండు లడ్డూలను తీసుకోవచ్చని టీటీడీ పేర్కొంది.
అర్హులు వీరు..
వృద్ధులకు వయసు 65 సంవత్సరాలు పూర్తై ఉండాలి. దివ్యాంగులు, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా లక్షణాలున్న ఉన్న వ్యక్తులు కూడా తిరుమల ఉచిత దర్శనం చేసుకోవచ్చని అధికారులు వివరించారు. ఒకవేళ వృద్ధులు నడవలేని స్థితిలో ఉంటే వారి వెంట ఓ వ్యక్తికి అనుమతి ఉంటుందని.. అటెండర్‌గా జీవిత భాగస్వామికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.
కావాల్సిన పత్రాలు:
ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. దివ్యాంగులు తప్పనిసరిగా వారి ఐడీ కార్డుతో పాటు.. ఫిజికల్ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకురావాలి. వృద్ధులు, దివ్యాంగులు కాకుండా పైన తెలిపిన ఆరోగ్య సమస్యలు ఉన్న వారు సంబంధిత సర్జన్ / స్పెషలిస్ట్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో రావాలి.
స్లాట్ ఇలా బుక్ చేసుకోవాలి
వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనం స్లాట్ కోసం టికెట్‌ను ఆన్లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి. అందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ముందుగా టీటీడీ వెబ్సైట్ Tirumala Tirupati Devasthanam(Official Booking Portal)ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలో Online Services ఆప్షన్‌పై క్లిక్ చేసి Differently Abled/Sr.Citizen Darshan ఆప్షన్‌పై క్లిక్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్, ఓటీపీ సాయంతో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు Category ఆప్షన్లో Senior Citizen/Medical Cases/Differently Abled ఈ మూడింటిలో ఒక ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏ రోజు స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ తేదీని ఎంచుకోవాలి. తర్వాత మిగిలిన వివరాలు నమోదు చేసి టికెట్ బుక్ చేసుకోవాలి.