Saturday, June 29, 2024

AP: త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి

ప్రజల సుఖ ప్రయాణమే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశం
కార్మికులు, ప్రజలు ఆర్టీసీకి రెండు కళ్ళ లాంటి వారు
రాష్ట్ర రవాణా అండ్ క్రీడల శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి

కుప్పం, జూన్ 26 (ప్రభ న్యూస్): ఎన్నికలకు ముందు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం హామీ ఇవ్వడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక కమిటీని ఏర్పాటు చేసి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్ ప్రయాణ అమలులో చిన్న చిన్న సమస్యలుంటే వాటిని పరిష్కరించుకొన్న తర్వాతనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కలిగించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా అండ్ క్రీడల శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ను దేశంలోని అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన బస్టాండ్ గా నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కుప్పం ఆర్టీసీ బస్టాండ్ లో 5 కొత్త ఆర్టీసీ బస్సులను మంత్రి ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ముందుగా బస్టాండ్, డిపో, గ్యారేజ్ ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు మొదటిసారిగా కుప్పం పర్యటనకు వచ్చిన సందర్భంగా నిన్న బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ను దేశంలోని అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన బస్టాండ్ గా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సీఎం ఆదేశాలతో నాలుగు ఐదు రకాలకు సంబంధించి డీపీఆర్ ను తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ప్రజల సుఖ ప్రయాణమే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశమని, కార్మికులు, ప్రజలు ఆర్టీసీకి రెండు కళ్ళు లాంటి వారని, మంచి కండీషన్ కలిగిన బస్సులను రోడ్డుపైకి తీసుకురావడం జరుగుతుందన్నారు. కార్మికుల, ప్రజల భద్రతే ఆర్టీసీకి ముఖ్యమన్నారు. ఆర్టీసీ కార్మికులకు మంచి రోజులు వచ్చాయని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం లో ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయడం జరిగిందని, కుప్పం ఆర్టీసీ బస్టాండ్ లో మంత్రిగా 5 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కుప్పంకు రావడంతోనే 5 కొత్త బస్సు లను ప్రారంభించడంతో పాటుగా గతంలో 30 సర్వీసులను రద్దు చేసిన వాటిని మళ్ళీ పునరుద్దరించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కుప్పం నుండి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సర్వీసులు నడపడం జరుగుతుందన్నారు.

- Advertisement -

మొన్న జరిగిన ఎన్నికల్లో ఉద్యోగులు, కార్మికులు తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా ఓట్ల ద్వారా ఆదరించారన్నారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏ సంస్థలోనైనా కార్మికులు సుఖంగా ఉంటేనే ఆ సంస్థ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డి వై సి యం ఈ. నాగేశ్వరరావు, డిపో మేనేజర్ పెంచాలయ్య, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement