మహిళలకు శుభవార్త అందించిన ఎపి సర్కార్
త్వరలోనే విధి విధానాలు ప్రకటన
ఆంధ్రప్రభ స్మార్ట్ – విజయవాడ – ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. అమరావతిలో ఆయన మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ, ఉచిత బస్సు ప్రయాణ పథకం విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
ఇది ఇలా ఉండగా, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తర్వాత సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన వెల్లడైంది. దీంతో ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త రానే వచ్చేసింది.
ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. దీంతో ఏపీ అధికారులు ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించి పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. ప్రధానంగా జీరో టికెట్ విధానంపై రెండు రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రూట్లకు అనుగుణంగా ఈ పథకాన్ని అమలు చేయాలనే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఓ నివేదిక సిద్ధం చేశారు. ఇక ఉచిత బస్సు ప్రయాణ పథకం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.