తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల పేరిట కుచ్చుటోపీ పెట్టారు కొంతమంది. శాశ్వత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయక నిరుద్యోగుల నుంచి లక్ష చొప్పున వసూలు చేసినట్టు తెలుస్తోంది. కాగా, తిరుమలలో లడ్డూ కౌంటర్లను నిర్వహిస్తున్న కేవీఎం ఇన్ఫో కామ్ సంస్థకు చెందిన ముగ్గురు సిబ్బందిపై టీటీడీ విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేరకు తిరుమల టు టౌన్ పోలీసులు ఇవ్వాల (శుక్రవారం) కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లా కొత్తపేటకు చెందిన జి.బబ్లూ ఫిర్యాదు మేరకు టీటీడీ విజిలెన్స్ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. కెవిఎం ఇన్ఫో కామ్ సంస్థకు చెందిన మేనేజర్ గణేష్, కో-ఆర్డినేటర్ చందు, లడ్డూ కౌంటర్ బాయ్ మేకల సురేష్ కలిసి కెవిఎం ఇన్ఫో కామ్ సంస్థలో రెగ్యులర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువత నుండి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేయడంతో బబ్లూ అనే యువకుడు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై తిరుమల టు టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.