ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి… ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడం వాయుగుండంగా మారి తమిళనాడు, ఆంధ్రప్రదేవ్ రాష్ట్రాల్లో దాని ప్రభావం చూపుతోంది. ఈ రోజు ఉదయం చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరం దాటింది. అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువుల పొంగిపొర్లుతున్నాయి.
అయితే చిత్తూరు జిల్లాలో వరదనీటిలో నలుగురు మహిళలు గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. బలిజపల్లి చెరువు వద్ద గల కాజ్వేపై వరద నీటిలో మహిళలు కొట్టుకుపోయారు. గల్లంతైన మహిళలు బంగారుపాళ్యం మండలం టేకుమండకు చెందిన జయంతి, కస్తూరి, ఉషారాణి, లక్ష్మిదేవిలుగా సమాచారం. గల్లంతైన మహిళల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే కడప జిల్లా రాజంపేట మండలంలో చెయ్యేరు నది పోటెత్తింది. ఇక్కడ కూడా పలువురు వరద నీటిలో గల్లంతైనట్లు సమాచారం.