అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో విద్యుత్ తీగలు తెగి పడడంతో నలుగురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను బళ్లారి ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన ఎంతో బాధాకరం అన్నారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. కాగా, ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఇక.. అనంతపురం విద్యుత్ షాక్ ఘటనలో ఏడీ, ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఘటనపై విద్యుత్ శాఖ భద్రతా డైరెక్టర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిస్కంను ఆదేశించింది.