కాకినాడ – సరదాగా విహారయాత్రకు వెళ్లిన యువకులు మృత్యువాత పడ్డారు. గోదావరిలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ మునిగిపోతున్న స్నేహితుడిని కాపాడుకునే క్రమంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. శనివారం సాయంత్రం కాకినాడ సమీపంలోని గోపిలంకలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆదివారం నలుగురు యువకుల మృతదేహాలను గజ ఈతగాళ్ల సాయంతో వెలికి తీశామని పోలీసులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం సజ్జాపురం పార్కు వీధికి చెందిన హనుమకొండ కార్తీక్, మద్దిని ఫణీంద్ర గణేష్, పెండ్యాల బాలాజీ, తిరుమలరావు రవితేజ, నేదునూరి భానుప్రసాద్, సలాది దుర్గామహేష్, కొమ్మిరెడ్డి చైతన్య స్నేహితులు. వీరంతా కలిసి తరచుగా విహారయాత్రలకు వెళుతుంటారు. దసరా సెలవులతో పాటు కార్తీక్ పుట్టిన రోజు కావడంతో శనివారం వారంతా మూడు బైక్ లపై యానాం వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తాళ్లరేవు మండలంలోని గోపిలంక పుష్కరఘాట్ కు చేరుకున్నారు.
గోదావరి ఒడ్డున పార్టీ చేసుకుంటుండగా వారిలో ఓ యువకుడు స్నానం చేయడానికి గోదావరిలో దూకాడు. ప్రమాదవశాత్తూ ఆ యువకుడు మునిగిపోతుండడంతో కాపాడేందుకు మరో ముగ్గురు స్నేహితులు దూకారు. వారు కూడా మునిగిపోతుండడంతో మిగతా వారు భయాందోళనలకు గురయ్యారు. సాయం కోసం కేకలు వేసినా ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రయోజనం లేకపోయింది.
దీంతో హనుమకొండ కార్తీక్(21), మద్దిని ఫణీంద్ర గణేష్(21), పెండ్యాల బాలాజీ(21), తిరుమలరావు రవితేజ(21) గోదావరిలో గల్లంతయ్యారు. ఫోన్ ద్వారా అధికారులకు సమాచారం అందించడంతో గజ ఈతగాళ్లతో తాళ్లరేవు తహసీల్దార్, కోరింగ ఎస్ఐ తదితరులు అక్కడికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో బోటులో గాలింపు చర్యలు చేపట్టారు.