జరుగుమల్లి (ప్రభన్యూస్) : వేసవి సెలవులు నాలుగు కుటుంబాల్లో విషాదం నింపాయి. ప్రకాశం జిల్లాలో కుంటలో మునిగి నలుగురు విద్యార్థులు చనిపోయిన ఘటన ఇవ్వాల (శనివారం) జరిగింది. జరుగుమల్లి మండలం అక్కచేరువుపాలెంలో రోజువారీగా వాకింగ్ కి వెళ్లిన పిల్లలు కుంటలో పడి చనిపోయారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలను పొలంలో పనిచేస్తున్న వ్యక్తి కాపాడారు. వాకింగ్‌కు వెళ్లే క్రమంలో కాళ్లు కడుక్కోవడానికి కుంటలో దిగిన ఆరుగురు పిల్లల్లో నలుగురు అందులో పడి చనిపోయారు.
అయితే.. దగ్గర పొలంలో పనిచేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి వీరిని చూసి పరుగు పరుగున వచ్చి మద్దినేని చందన (14), చీమకుర్తి మండలం బుసరపల్లికి చెందిన మున్నంగి చందన (13)ను కాపాడారు. చనిపోయిన వారిలో చింతల కౌశిక్ (16), మద్దినేని సుబ్రమణ్యం (15) చీమకుర్తి మండలం బుసరపల్లికి చెందిన మున్నంగి శివాజీ (13), అబ్బూరి హరి భగవన్నారాయణ (11) ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. వీరిలో కొంతమంది అమ్మమ్మగారింటికి వచ్చి ఇలా మృత్యువుకోరల్లో చిక్కుకున్నారు. నలుగురు విద్యార్థుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.