Monday, November 25, 2024

జమ్మూకాశ్మీర్‌లో శ్రీవారి ఆల‌యం.. రూ.33 కోట్లతో నిర్మాణం

దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సంక‌ల్పించింది. ఈ క్రమంలో ఆదివారం జమ్మూకశ్మీర్ లో వెంకటేశ్వరస్వామి ఆలయానికి భూమిపూజ నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీవారి ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుమల ఆలయ ఈవో జవహర్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

జ‌మ్మూజిల్లాలోని మ‌జిన్ గ్రామం ద‌గ్గ‌ర 62 ఎక‌రాల విస్తీర్ణంలో ఈ ఆల‌యాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నారు. శ్రీవారి ఆలయం కోసం ప్రభుత్వం 62 ఎకరాల భూమిని 40 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. ఈ ఆలయాన్ని రూ.33 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా నిర్మించనున్నారు. అంతేకాదు, కేవలం ఏడాదిన్నరలోనే ఆలయ నిర్మాణం పూర్తిచేయాలని టీటీడీ లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడ‌త‌లో 27.72 కోట్ల రూపాయ‌ల‌తో వాహ‌న మండ‌పం, అర్చ‌కులు, ఇత‌ర పాల‌నా సిబ్బందికి వ‌స‌తి గృహాలు, తీర్థ‌యాత్రికుల‌కు వేచి ఉండే హాల్స్‌, ఇత‌రమౌలిక వ‌సతులు, ర‌హ‌దారులు, డ్రైనేజీ ప‌నులు, నీటిస‌ర‌ఫ‌రా, విద్యుద్ధీక‌ర‌ణ వంటి ప‌నుల‌ను పూర్తిచేస్తారు. రెండో విడ‌త‌లో మొత్తం 5.50 కోట్ల రూపాయ‌ల‌తో వేద‌పాఠ‌శాల‌, క‌ళ్యాణ‌మండ‌పం నిర్మాణాలు పూర్తి చేస్తారు. 18 నెల‌ల్లో నిర్మాణం ప‌నులు పూర్తిచేయాల‌ని టీటీడీ సంక‌ల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement