Saturday, November 23, 2024

శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుష్కరిణిలో మధ్యకాలం నాటి బంగారు, రాగి నాణేలు లభ్యం

మంగళగిరి:ఆగస్ట్ 4 ప్రభ న్యూస్- నగరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన చారిత్రాత్మక కళ్యాణ పుష్కరిణి (పెద కోనేరు) పునర్వైభవం తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులు పేర్కొన్నారు. కోనేరు అభివృద్ధి పనుల్లో భాగంగా అడుగు భాగం పూడికతీత పనుల్లో 1870-1890 మధ్య కాలం నాటి కి చెందిన బంగారు, రాగి ఆయనలతోపాటు స్వామి వారి పూజా సామాగ్రి బయట పడ్డాయి. ఈ సందర్భంగా వాటిని ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు లు పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు.

సుమారు 465 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన చారిత్రాత్మక కళ్యాణ పుష్కరిణి (పెద కోనేరు) పనులు గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభించడం జరిగిందని, తొలినాళ్లలో మురికి నీటితో నిండిపోయి ఉన్న కోనేరును శుభ్రపర్చడం జరిగిందన్నారు. పురాతన వారసత్వ సంపదను, ఆనాటి మహారాజుల గుర్తులను ప్రజలకు చూపించాలనే ఉద్దేశ్యంతో ఈయన పుష్కరిణి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. సుమారు 150 రెండు అడుగుల లోతు వరకు కోనేటిలో పూడిక తీసిన అనంతరం అడుగు భాగంలో పెద్ద పెద్ద కొండ రాళ్లు రావడం జరిగిందన్నారు. కోనేటి అడుగుభాగం పూర్తిగా వచ్చినట్లేనని చెప్పారు. కోనేరు అడుగుభాగం నుంచి పై వరకు మెట్లు నిర్మాణం జరిగిందన్నారు.

కోనేటి అభివృద్ధి పనుల్లో భాగంగా ఆంజనేయ స్వామి గుడి, శివలింగాలు గత కొన్ని నెలల క్రితం బయటపడటంతో పాటు మెట్లపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు చెక్కబడి ఉన్నాయని గుర్తు చేశారు. కోనేరు అభివృద్ధి పనుల్లో భాగంగా 1870- 1890 మధ్యకాలం కి చెందిన కొన్ని బంగారు, రాగి నాణేలతో పాటు స్వామివారి పూజా సామాగ్రి లభించాయని, వాటిని తహసిల్దార్ అప్పగించడం జరిగిందన్నారు.

- Advertisement -

ఇంతటి గొప్ప కార్యక్రమం చేయడం మనందరి అదృష్టం, భాగ్యంగా భావిస్తున్నామని, రానున్న రెండు మూడు రోజుల్లో దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కోనేరు దిగువ భాగం నుంచి పునరుద్ధరించేందుకు తగు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. గత కొన్నేళ్ళ క్రితం కోనేరులో పిడుగు పడటంతో మెట్లు పడిపోయిన పరిస్థితి నెలకొందని, ఈ నేపథ్యంలో మెట్లను పునరుద్ధరించడం జరుగుతుందన్నారు. భక్తుల సౌకర్యార్థం కళ్యాణ పుష్కరిణిని భవిష్యత్తులో అతి పవిత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఏమైనా రానున్న మరో నాలుగు ఐదు నెలల్లో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కళ్యాణ పుష్కరిణి పునరుద్ధరణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ కళ్యాణ పుష్కరిణి అభివృద్ధి పనులను పరిశీలించిన సందర్భంలో మరిన్ని శాఖాపరమైన నిధులను కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తాం.

నగరంలో బాలాంబ సత్రాన్ని పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టి డిసెంబరు చివరి నాటికి భక్తులకు అన్నదాన కార్యక్రమం తిరిగి ప్రారంభిస్తామని ఆర్కే స్పష్టం చేశారు. అన్నం లేదని మహాతల్లి బాలాంబ దగ్గరకు వచ్చిన వారందరికీ అన్నం పెట్టేదని, ఈ విషయం చాలామంది పెద్దలకు కూడా తెలిసిందేనన్నారు. స్థానిక పెద్దల కోరిక మేరకు తహసీల్ ద్వారా జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ లకు లెటర్లు రాసామని, రెవెన్యూ చట్ట ప్రకారం అతి త్వరలోనే బాలాంబ సత్ర స్థలం ప్రభుత్వానికి అధీనం కాబోతుందని, స్థలం ప్రభుత్వానికి అధీనమైన మరుక్షణం లో ఎండోమెంట్ శాఖకు బదలాయింపు చేసుకుని సత్రాన్ని నిర్మించి బాలాంబ ఆశయాలను కొనసాగించే విధంగా పుష్కరిణిని చూసేందుకు వచ్చిన భక్తులందరికీ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించే విధంగా కృషి చేస్తామన్నారు.


ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జీవీ రామ్ ప్రసాద్, పట్టణ సీఐ బి. అంకమ్మరావు, దేవస్థాన ఈఓ అన్నపురెడ్డి రామకోటిరెడ్డి, జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, పట్టణ జేసీఎస్ కన్వీనర్ ఎండి ఫిరోజ్, నాయకులు ఆకురాతి రాజేష్, సంకా బాలాజీ గుప్తా, బేతపూడి నర్సయ్య, బుల్లా రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement