Chandragiri Fort: చంద్రగిరి కోట అతి పురాతనమైన విజయనగర రాజుల కోట. అయితే ఇప్పటికీ ఆ కోటలోని రహస్యాలు మిస్టరీనే. ఒకప్పుడు వెలుగువెలిగిన కోట ఇప్పుడు చీకటి మయం అవుతోంది. పర్యాటకులతో కళకళలాడుతూ కనిపించాల్సిన ఈ ప్రాంతం కరోనా కారణంగా వెలవెలబోతోంది.
శతాబ్దాల కాలంనాటి చరిత్రకు ఆనవాళ్లుగా చంద్రగిరి కోట నిలుస్తుంది. విజయనగర రాజులలో రాయలవారి కాలం నాటి పాలనా రాజధాని అది. దక్షిణాదిన శ్రీకృష్ణదేవరాయలు పలు సందర్భాల్లో ఈ కోటకు వచ్చారని చరిత్ర చెబుతోంది. శత్రు దుర్భేధ్యమైన కోటను అర్ధ చంద్రాకారంగా ఉన్న కొండ పాద భాగంలో నిర్మించడం వల్ల దీనికి చంద్రగిరి కోట అనే పేరు వచ్చింది.
సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే మరెన్నో వింతలు విశేషాలకు నిలయం ఈ ప్రాంతం. కొండలమాటున కాశిరాళ్లతో పెద్దపెద్ద రాతి మండపాలు ఇక్కడ హైలెట్. శతృదుర్భెద్యమైన కోట గోడలు కొండమీద నిర్మించిన దుర్గం ఇలా ఒకటేమిటి అడుగడుగునా అద్బుతాలకు ఆలవాలం.
కొండపై నిర్మించిన కట్టడాలు రోజురోజుకు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. దీంతో భావితరాలకు చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోయే ప్రమాదం ఉంది. చంద్రగిరి కోట నిర్మాణం, పూర్వం రాజులు నిర్మించిన భవనాలను కాపాడాల్సిన పురావస్తు శాఖ ఆ దిశగా అడుగులు వేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రగిరికి సమీపంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ, అవి అభివృద్ధికి నోచుకోవడం లేదని పర్యాటకులు అంటున్నారు.