విజయనగరం, ఆగస్టు 8: టీడీపీ మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహన్‌రావు (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో కెంబూరి చికిత్స పొందుతున్నారు. అయితే గురువారం ఉదయం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. బొబ్బిలి ఎంపీ, శాసనసభ్యునిగా కెంబూరి పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలంలోని పుర్లి గ్రామంలో 1949 అక్టోబరు 12న కెంబూరి జన్మించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
1985 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నుంచి చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యునిగా గెలుపొందారు. 1985 నుంచి 1989 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆపై 1989లో తొమ్మిదవ లోక్‌సభ సాధారణ ఎన్నికలలో టీడీపీ బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. పేద వర్గాల అభివృద్ధి కోసం కెంబూరి అహర్నిశలు శ్రమించారు. కెంబూరి రామ్మోహన్ రావు మృతిపట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.