Sunday, November 17, 2024

Breaking: చిత్తూరులో YSR విగ్రహం ధ్వంసం… రోడ్డుపై వైసీపీ ధర్నా

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా విగ్రహాల ధ్వంసం కలకలం రేపుతోంది. ఇటీవల ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ విగ్రహానికి నిప్పంటించారు. తాజాగా చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ విగ్రహాన్ని కత్తితో నరికి ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్‌పురం మండల కార్యాలయం వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో నరికి ధ్వంసం చేశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహించే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోనే ఈ ఘటన జరిగింది. విషయం తెలిసిన వెంటనే  ఆర్టీసీ వైస్ చైర్మన్  విజయానంద రెడ్డి, వైసీపీ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ చిత్తూరు పుత్తూరు రోడ్డుపై వైసీపీ నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. 

మరోవైపు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలకు పాల్పడిన నేతల తోలు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఘటనకు సంబంధించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. కాగా, ఇటీవల గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని సుత్తితో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement