Tuesday, November 26, 2024

అభిమానుల ఆద‌ర‌ణ‌తో రెండేళ్ల కష్టం మర్చిపోయా.. స‌ర్కారువారి పాట విజ‌యోత్స‌వాల్లో మ‌హేశ్‌బాబు

కర్నూలు, (ప్రభ న్యూస్ బ్యూరో) : కొవిడ్‌, లాక్‌డౌన్‌ కారణంగా రెండేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సర్కార్ వారి పాటకు మీరందించిన విజయం ముందు అవన్నీ ఇప్పుడు మర్చిపోయాం అని సినీ హీరో మహేష్ బాబు అన్నారు. మహేశ్‌బాబు హీరోగా, దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట చిత్రం ఇటీవల విడుదలై, హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, కొత్త రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం కర్నూలులోని ‘ఎస్‌.టి.బి.సి’ కళాశాల మైదానంలో ‘మ మ మాస్‌’ పేరుతో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. కిక్కిరిసిన అభిమానుల మధ్య వేడుకనుద్దేశించి మహేశ్‌ మాట్లాడుతూ.. ”ఒక్కడు’ సినిమా చిత్రీకరణ సమయంలో కర్నూలు రావడం జరిగిందన్నారు. మళ్లీ ఇప్పుడిలా రావడం సంతోషంగా ఉందన్నారు. సర్కారీ వారి పాట చిత్ర విజయోత్సవ వేడుకను ఇక్కడ నిర్వహిస్తున్నామని నిర్మాతలు చెప్పగానే హ్యాపీగా ఫీలయ్యాన్నారు.

ఈ వేడుకకు ఇంతమంది వస్తారని తాను ఊహించలేదన్నారు. ఫంక్షన్‌ అంటూ జరిగితే రాయలసీమలోనే జరగాలి అన్నంతగా ఇక్కడి వాతావరణం ఉందన్నారు. మీ అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు. ఈ సినిమా చూడగానే మా అబ్బాయి నాకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి, హగ్‌ చేసుకున్నాడు. ‘అన్నింటికంటే నువ్వు ఈ సినిమాలోనే బాగా చేశావు నాన్న’ అని మా అమ్మాయి మెచ్చుకుంది. ‘పోకిరి, దూకుడు కంటే ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది’ అని నాన్న అన్నారు. ఈ క్రెడిట్‌ అంతా దర్శకుడు పరశురామ్‌కే చెందుతుందన్నారు. కొవిడ్‌,లాక్‌డౌన్‌ కారణంగా రెండేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మీరందించిన విజయం ముందు అవన్నీ ఇప్పుడు కనిపించట్లేదు. ఈ చిత్రానికి పనిచేసిన టెక్నిషియన్లు, నిర్మాతలకు ధన్యవాదాలు. కీర్తిసురేశ్‌, సముద్రఖని వల్ల సినిమాకు కొత్తదనం వచ్చింది. తమన్‌ అందించిన ‘కళావతి’ పాట ఆంథెమ్‌లా మారింది” అని మహేశ్‌బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో పరశురామ్‌, తమన్‌, అనంత శ్రీరామ్‌తోపాటు ఆంధ్రా, సీడెడ్‌, నైజాంకు చెందిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement