Wednesday, November 20, 2024

Foreign Migratory Birds : ప్రకాశంలో విదేశీ పక్షుల సందడి.. అతిథులను సంరక్షిస్తున్న గ్రామస్తులు

సంక్రాంతి పండుగకు అల్లుళ్లు వచ్చినట్టే ఇక్కడకు వచ్చి ఈ ప్రాంతవాసులను విదేశీ పక్షులు పలకరిస్తాయి. ఖండాంతరాలు దాటి.. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఏటా పలకరించే విహంగ నేస్తాలు..మళ్లీ ఆ పళ్లె ముంగిట సందడి చేస్తున్నాయి.. వందల ఏళ్ళ నుంచి క్రమం తప్పకుండా వచ్చే ఈ పక్షులు ఇక్కడే మకాం వేసి పిల్లల్ని పొదిగి పెద్ద చేసి మళ్లీ తరలి వెళతాయి. తమ ఊరు వచ్చిన ఈ విదేశీ అతిథులను గ్రామస్తులు కంటికి రెప్పలా చూసుకుంటారు. నైజీరియా, కొరియా దేశాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చే కొంగ జాతి పక్షులను ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారపాలెం గ్రామస్తులు అతిథులుగా భావిస్తూ.. సంరక్షించుకుంటూ మురిసిపోతున్నారు.

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమ వారి పాలెం చిన్న పల్లెటూరు. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆ గ్రామానికి నైజీరియా, కొరియా దేశాల నుంచి వైట్ స్ర్టొక్ రకానికి చెందిన కొంగ జాతి పక్షులు అతిథులుగా వచ్చి అతిథ్యం స్వీకరిస్తున్నాయి. నాలుగు రోజుల నుండి క్రమంతప్పకుండా గ్రామానికి పక్షుల రాక పెరగడంతో ప్రతి ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ప్రకాశం, గుంటూరు జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న వెలమవారిపాలెం గ్రామానికి దశాబ్దాలకాలం నుండే పక్షుల రాక ఆరంభమైంది. జనవరి మొదటి వారంలో గ్రామానికి వచ్చి చెట్లను ఆవాసంగా చేసుకొని గుడ్లను పొదిగి పిల్లలకు రెక్కలు రాగానే జూలై నెలలో తిరిగి స్వదేశానికి వెళుతుంటాయి.

ఆ దేశాలలో జనవరి నుంచి జూన్ వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తరతరాలుగా ఆరు నెలలు ఇక్కడికి వచ్చి పక్షులకు ఉంటున్నాయని గ్రామస్తులు అంటున్నారు. పక్షులను తామంతా అతిథులుగా భావిస్తున్నామని, చిన్న పిల్లలను సైతం ఏమీ చేయవని పక్షుల జోలికి ఎవరు వెళ్ళినా సహించమని గ్రామస్తులు అంటున్నారు. 2 సంవత్సరాల క్రితం రాత్రి వేళల్లో చెట్లపై నిద్రిస్తున్న పక్షులను వేటగాళ్ళు పథకం ప్రకారం పట్టుకుని వెళ్తుండగా గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆయనను అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పజెప్పారు. రెండేళ్ల నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడంతో ఆహారానికి, తాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది.

గతంలో వర్షాలు లేక ఆహారం, నీరు దొరకక పక్షులు కొన్ని మృతి చెందాయి. దీంతో పక్షుల బాధ తెలుసుకొని గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి 10 ఎకరాల్లోని గ్రామ పంచాయతీ నిధులతో చెరువు తవ్వించారు. విదేశీ పక్షులను వీక్షించేందుకు ప్రకాశం జిల్లా తో పాటు ఇతర జిల్లాల నుండి సందర్శకుల గ్రామానికి వస్తుంటారు.. వేటగాళ్ల బారిన పడకుండా పక్షి సంరక్షణ కేంద్రంగా మార్చాలని పర్యాటక కేంద్రంగా గ్రామాన్ని తీర్చిదిద్దాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement