Tuesday, November 26, 2024

AP: టీటీడీ చరిత్రలో తొలిసారి… 9,000 మందికి ఇంటి స్థలాలు పంపిణీ


తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) చరిత్రలో తొలిసారిగా 9వేల మందికి
పైగా ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. రెండు విడతలుగా 5వేల మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన టీటీడీ ఇవాళ 4వేల మంది విశ్రాంత ఉద్యోగులకు పంపిణీ చేసింది. తిరుపతి మహతి ఆడిటోరియంలో మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, కార్యనిర్వాహణాధికారి ఎ.వి. ధర్మారెడ్డి పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా కరుణాకర రెడ్డి మాట్లాడుతూ… 16ఏళ్ల క్రితం తాను టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆదేశాలతో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నించామని చెప్పారు. తన పదవీకాలం ముగిసిన తర్వాత వచ్చిన అడ్డంకుల కారణంగా ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు నిలిచిపోయిందని, ఆ బాధ ఇప్పటికీ తన మెదడును తొలుస్తోందని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి కరుణ, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రెండోసారి తనకు టీటీడీ ఛైర్మన్ గా అవకాశం రాగా సర్వీసులో ఉన్న ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని సంకల్పం చేసుకున్నానన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే అంగీకరించారని చెప్పారు.
ఇంకా మిగిలిపోయిన ఉద్యోగులు, పెన్షనర్లకు అందరికీ తప్పకుండా ఇంటి స్థలాలు కేటాయిస్తామని తెలియజేశారు. అదేవిధంగా టీటీడీలోని కార్పొరేషన్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఎఫ్ఎంఎస్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులందరికీ రు.5 వేల నుండి రూ.20 వేల వరకు వేతనాలు పెంచినట్లు తెలియజేశారు.


ధర్మారెడ్డి మాట్లాడుతూ… ఇదివరకు వడమాలపేట వద్ద రెండు విడతల్లో కలిపి 432 ఎకరాల్లో 5,221 మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలకు సంబంధించి లేఅవుట్, ప్లాట్ నంబర్లు వేసి, డిప్ తీసి ప్రొసీడింగ్స్ అందించామన్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ భూమి కొనుగోలు, లేఅవుట్ అభివృద్ధి పనుల కోసం రూ.150 కోట్లు వెచ్చించామని వెల్లడించారు. అదేవిధంగా ఏర్పేడు మండలం పల్లం గ్రామం వద్ద 400 ఎకరాలు ప్రభుత్వం నుండి కొనుగోలు చేసేందుకు రూ.90 కోట్లు వెచ్చించామని, 320 ఎకరాలను ఇప్పటికే జిల్లా అధికారులు టీటీడీకి స్వాధీనం చేశారని చెప్పారు. స్వాధీనం చేసుకున్న స్థలంలో ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయిస్తూ ప్రస్తుతం ప్రొసీడింగ్స్ ఇస్తున్నామని, వెంటనే ప్లాట్ నంబర్లు వేసి, డిప్ తీసి ఉద్యోగులకు కేటాయిస్తామని వివరించారు. ఇక్కడ 723 మంది ఉద్యోగులకు, 3,277 మంది పెన్షనర్లకు కలిపి 4,000 మందికి ఇంటి స్థలాల కేటాయిస్తున్నామని తెలియజేశారు.

- Advertisement -

2015వ సంవత్సరం వరకు చేరిన రెగ్యులర్ ఉద్యోగుల్లో 800 మంది, పెన్షనర్లు 1,780 మంది ఇంకా మిగిలారని చెప్పారు. పల్లం వద్ద ప్రస్తుతం 100 ఎకరాలు మిగులుగా ఉందని, మరో 200 ఎకరాలు ప్రభుత్వం నుండి కొనుగోలు చేసి మిగిలిన 2,580 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని తెలియజేశారు. ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం ఇప్పటివరకు దాదాపు రూ.240 కోట్లు టీటీడీ ఖర్చు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో స్నేహలత, ఇతర అధికారులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement