Friday, November 22, 2024

నిర్లక్ష్యానికి .. మూల్యం చెల్లించారు.. సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన్‌

ప్రభ న్యూస్‌ ప్రతినిధి , నెల్లూరు : రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 639 , పట్టణ ప్రాంతాల్లో 288 .. మొత్తం 927 గ్రామ , వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది . రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పరిపాలన వికేంద్రీకరణ , ప్రజల ముంగిటకే పరిపాలన అనే ధ్యేయంతో సచివాలయ వ్యవస్థను , వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు.

జిల్లాలో దాదాపు 8500 మందికి పైగా విద్యావంతులు ప్రభుత్వం పటిష్టంగా నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులై గ్రామ , వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు సాధించారు. తొలుత మందకొడిగా ప్రారంభమైన ఈ వ్యవస్థ కొవిడ్‌ సమయంలో ఉద్యోగులు శ్రద్ధగా పనిచేయడంతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. దేశంలోని అన్నీ రాష్ట్రాలు ఏపీ వైపు చూసేలా సచివాలయ ఉద్యోగులు ప్రాణాలకు తెగించి కొవిడ్‌ నివారణలో , లాక్‌డౌన్‌ అమలులో తమ వంతు పాత్ర పోషించారు.

కొంతమంది నిర్లక్ష్యంతో అందరికీ చెడ్డపేరు
కాగా , జిల్లాలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగుల్లో కొంతమంది విధి నిర్వహణలో సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారు. మరికొంత మంది మాత్రం ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న అహంకారంతో వ్యవహరిస్తూ ప్రజలకు సేవలు అందించడం సంగతి అటుంచి , అసలు కార్యాలయాలకే సక్రమంగా రావడం మానివేశారు. దీంతో సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సచివాలయ వ్యవస్థ ఉద్దేశ్యాలకు ఆ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు కొంతమంది తూట్లు పొడుస్తున్నారు.

మండల అధికారుల మార్గదర్శకత్వం శూన్యం
సచివాలయ వ్యవస్థను నిరంతరం తనిఖీ చేస్తూ వారికి పని నేర్పించడం , మార్గదర్శకంగా వ్యవహరిచండంతో పాటు వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నివేదికలను సంబంధిత ఉన్నతాధికారులకు పంపించడం వంటి బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం మండల స్థాయి , పట్టణ , నగరాల్లో అదే స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించింది. వీరందరిపై అప్పుడప్పుడు పర్యవేక్షణ చేయాలని జిల్లా స్థాయి , డివిజన్‌ స్థాయి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ సూచించింది .

జిల్లాలో కలెక్టర్‌ , జాయింట్‌ కలెక్టర్‌ , డీపీవో , జెడ్పీ సీఈవో , తదితర అధికారులు సచివాలయాలను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. అంతే స్ధాయిలో జిల్లాలోని ఏ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారి కూడా సచివాలయాలు తనిఖీ చేయడం లేదు. ఉదాహరణకు గ్రామ , వార్డు సచివాలయాల్లో సర్వే అసిస్టెంట్లు ఉంటే .. వారి పనితీరును ఏ రోజు కూడా జిల్లా స్థాయి సర్వే అధికారులు పరిశీలించిన పాపాన పోలేదు. అదే విధంగా విద్యుత్‌ , వ్యవసాయం , ఉద్యానం , పశు సంవర్థక , ఆరోగ్యం , సంక్షేమం , తదితర శాఖలకు సంబంధించి జిల్లా అధికారులు సచివాలయ తనిఖీలను పూర్తిగా మర్చిపోయారు. వారిని ఆదర్శంగా తీసుకుంటూ అన్నీ మండలాల్లో మండల అధికారులు కూడా సచివాలయ సందర్శనకు స్వస్తి చెప్పేశారు. దీంతో పర్యవేక్షణ కరువు కావడంతో సచివాలయ ఉద్యోగుల్లో అలసత్వం పెరిగిపోయింది . సచివాలయ ఉద్యోగులను చూసీ చూడనట్లు వదిలివేస్తున్న కొంతమంది గ్రామ కార్యదర్శులు కూడా విధులకు తరచుగా డుమ్మా కొడుతున్నట్లు సమాచారం .

- Advertisement -

ఇందుకూరుపేట మండలంలో ఆరు మంది సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన్‌
జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఈనెల 5వ తేది ఇందుకూరుపేట మండలంలో నిర్వహిస్తున్న వార్డు సభ్యుల శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. అదే విధంగా జగనన్న కాలనీలను పరిశీలించారు. ఈ క్రమంలో భాగంగా ఆయన మండలంలో డేవిస్‌పేట గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఆయన తనిఖీ చేసిన సమయంలో గ్రామ సంక్షేమ సహాయకుడు ఎం. నవీన్‌కుమార్‌ , డిజిటల్‌ అసిస్టెంట్‌ సుప్రజ , వీఏహెచ్‌ఏ పి. శ్యామల , మహిళా పోలీసు శ్రావ్య , వీహెచ్‌ఏ సుజాత , గ్రామ సర్వేయర్‌ అవంతిలు కార్యాలయంలో లేరు. ఈ ఆరు మందిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది . జిల్లా కలెక్టర్‌ మండలంలో పర్యటిస్తారని వారికి సమాచారం ఉన్నప్పటికీ అత్యంత నిర్లక్ష్యంగా విధులకు డుమ్మా కొట్టారు.

వీరితో పాటు ఏఎన్‌ఎం సుచిత్ర , ఎనర్జీ అసిస్టెంట్‌ ఎం. వెంకట కృష్ణలు ఎంపీడీవో అనుమతులు పొంది కార్యాలయంలో లేకపోయినప్పటికీ మూమెంట్‌ రిజిస్టర్‌లో నమోదు చేయకపోవడంతో వారికి చార్జి మెమోలను జారీ చేసిన జిల్లా కలెక్టర్‌ .. పరిపాలన వైఫల్యంగా భావిస్తూ పంచాయతీ కార్యదర్శి తిరుపతయ్యకి కూడా చార్జి మెమో అందజేసినట్లు తెలుస్తోంది . ఇప్పటి వరకు చర్యలు లేకుండా ధీమాగా సాగిపోతున్న సచివాలయ ఉద్యోగుల్లో తాజాగా కలెక్టర్‌ తసుకున్న చర్యలతో ఒకే సచివాలయంలో 9 మంది ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉండడం చర్చనీయాంశమైంది . కాగా , సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక మండల అధికారుల తనిఖీలు లేకపోవడమే కారణమని భావిస్తున్న జిల్లా కలెక్టర్‌ .. జిల్లాలోని అన్నీ శాఖల మండల అధికారులకు మెమో రూపంలో నోట్‌ పంపినట్లు సమాచారం .

సచివాలయ ఉద్యోగుల పనితీరు మారాలి : ప్రజల ఆకాంక్ష
వారంతా విద్యావంతులు . రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది . పటిష్టంగా నిర్వహించిన పరీక్షలో తమ ప్రతిభా పాటవాలతో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఎవరికీ కూడా లంచాలు ఇవ్వకుండానే వారు ఉద్యోగాలు పొందారు. కొవిడ్‌ సమయంలో ప్రశంసలు అందుకున్న వారు కాలక్రమంలో తీరు మారడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొన్ని సచివాలయాల్లో ఉద్యోగులు ప్రజలు ఎందుకొస్తున్నారో ఆరా తీయడం మర్చిపోయారు. మరికొంత మంది సర్పంచ్‌లను , ప్రజా ప్రతినిధులను ఆఖరకు మండల అధికారులను ఖాతరు చేయడం లేదు. ఉజ్వల భవిష్యత్తు ముందు ఉన్న సచివాలయ ఉద్యోగులు తీరు మార్చుకోవాలని , ప్రజలకు మంచి సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రజల ఆకాంక్షగా ఉంది .

Advertisement

తాజా వార్తలు

Advertisement