Monday, November 25, 2024

వరద సహాయక చ‌ర్య‌ల‌ కోసం.. ఏపీకి వెయ్యి కోట్లు కావాలే..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వరదల ముప్పుకు గురయ్యే తీర ప్రాంత రాష్ట్రాలకు కేంద్ర సహాయం గణనీయంగా పెంచాలని వైఎస్సార్సీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం లోక్‌సభ లో ఆయన ప్రసంగిస్తూ కాలానుగుణంగా ప్రభుత్వం వరద నిర్వహణ కోసం నిధులను పెంచే అంశాన్ని పరిశీలించాలని, వివిధ పథకాలు, ఇతర అంశాల కింద రాష్ట్రాలకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని అన్నారు. వరద నష్టాలను త్వరగా అంచనా వేయాలని ఎంపీ లావు కేంద్రానికి సూచించారు. గత ఐదేళ్లుగా వరదల వల్ల జరిగిన నష్టానికి ఇచ్చే నిధుల్లో పెంపు కనిపించట్లేదని, 2020 వరకు రూ.11,356.235 కోట్లు అంచనా వేసినట్టు చెప్పారు.

2021 ఆర్థిక సంవత్సరానికి ఇంకా లెక్కించాల్సి ఉందన్నారు. వరద నిర్వహణ కోసం సాధారణ కేటగిరీ రాష్ట్రాలకు కేంద్ర మద్దతు 75% నుంచి 50%కి తగ్గించారని, నీతి ఆయోగ్ సిఫారసులు, కేంద్ర ప్రాయోజిత పథకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ నిబంధనల కారణంగా భవిష్యత్‌లో పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశముందని ప్రభుత్వం పేర్కొన్న అంశాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు తక్షణమే అందజేయాల్సిన సాయాలను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రాయలసీమలోని 4 జిల్లాల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్న, రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల కోసం తక్షణ సహాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సంక్షోభ సమయంలో వరి సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement